కుత్బుల్లాపూర్‌‌ "కింగ్" ఎవరు?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఎమ్మెల్యే వివేకానంద హ్యాట్రిక్ విజయంకోసం ప్రయత్నిస్తున్నారు

Update: 2023-10-11 13:31 GMT

తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. అయితే హైదరాబాద్ నగరంలో ఉన్న నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ కు కొంత అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరగడం కారణంగా నగరంలోని ఎక్కువ ప్రాంతాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కుత్బుల్లా‌పూర్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పారిశ్రామికంగా, రియల్ ఎస్టేట్ పరంగా ఈ ప్రాంతంలోని బాచుపల్లి, కుత్బుల్లాపూర్ మండలాలు అభివృద్ధి చెందడం కూడా కారు పార్టీకి కలసి వచ్చే అంశంగా చూస్తున్నారు.

హ్యాట్రిక్ విజయం కోసం...
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కుత్బుల్లా‌పూర్ నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడిన తొలి ఎన్నికలు అంటే 2009లో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలం గౌడ్ గెలిచారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద ఇక్కడి నుంచి తొలిసారి విజయం సాధించారు. ఆయన తర్వాత బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లోనూ తన సత్తా చాటారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలోకి ఈ ప్రాంతం వస్తుంది. ఎక్కువగా అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ నివసిస్తుంటారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోకి ఈ నియోజకవర్గం వస్తుంది.
అభివృద్ధి పనులు...
ప్రధానంగా ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ల నిర్మాణం, రహదారుల పనులు పూర్తి చేయడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం, తాగునీటి సౌకర్యం మెరుగుపర్చడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద చాలా వరకూ సక్సెస్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు కారణంగా నిధులు తీసుకు వచ్చి అభివృద్ధిని వేగవంతంగా చేశారు. దీంతో మరోసారి తన గెలుపు నల్లేరు మీద నడకేనని ఆయన భావిస్తున్నారు. మరోసారి కూడా ఆయనకే గులాబీ బాస్ టిక్కెట్ కేటాయిచడంతో గత కొన్ని రోజుల నుంచి ఇంటింటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే రియల్ ఎస్టేట్ పరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు కూడా బలంగా ఉండటంతో గెలుపు ధీమా ఉన్నా వివేకానంద శ్రమించక తప్పదు.
విభేదాలు సమసి...
దీనికి తోడు ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజుతో విభేదాలు కూడా సమసిపోయాయి. ఈయన ఈసారి కుత్బుల్లాపూర్ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ చివరకు వివేకానందకే టిక్కెట్ దక్కింది. శంభీర్‌పూర్ రాజును పార్టీ హైకమాండ్ సముదాయించడంతో ఆయన వివేకానందకు మద్దతుగా నిలిచేందుకు అంగీకరించారు. దీంతో కుత్బుల్లాపూర్ లోని గులాబీ పార్టీలో గ్రూపు విభేదాలు సమసి పోయినట్లే. దీంతో హ్యాట్రిక్ విజయం తనదేనన్న నమ్మకంతో వివేకానంద ఉన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను ఒడ్డున పడేస్తాయన్న విశ్వాసంతో ఉన్నారు. బలమైన క్యాడర్ కూడా ఉండటం అదనపు బలం.


Tags:    

Similar News