Congress : షర్మిలమ్మ చేతులూపినా... రంకెలేసినా.. కాగితాలు కనపడటం లేదే?
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం చూపలేదని తెలిసిందే. అందుకే వైఎస్ షర్మిలను చీఫ్ గా చేసి ఒక ప్రయోగం చేసిది;
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా ప్రభావం చూపలేదని అందరికీ తెలిసిందే. అందుకే ఏరికోరి వైఎస్ షర్మిలను చీఫ్ గా చేసి ఒక ప్రయోగం చేయాలని ఆ పార్టీ భావించింది. సరే.. షర్మిల వచ్చినా కాంగ్రెస్ ఈసారైనా శానసభలోకి కాలుమోపుతుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే.. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పై ఏపీ ప్రజల్లో ఇంకా ఆగ్రహం చల్లారలేదు. ఎవరు వచ్చినా ఆ పార్టీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు. అసలు ఓటు బ్యాంకు కూడా లేకుండా పోయింది. అక్కడ మరో జాతీయ పార్టీ బీజేపీది కూడా అదే పరిస్థితి. అయితే కాంగ్రెస్ కంటే బీజేపీ కొంతలో కొంత నయం. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఇక్కడ కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులైనా దొరుకుతారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయంటే కొంత బలంగా ఉన్నట్లే.
పదేళ్ల నుంచి....
కానీ కాంగ్రెస్ పరిస్థితి అలా కాదు. పదేళ్ల నుంచి కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. ఏపీలో గత పదేళ్లుగా చట్ట సభల్లోకి కూడా కాలుకూడా పెట్టలేకపోయింది. దీంతో నేతలతో పాటు క్యాడర్ కూడా చెల్లాచెదురయింది. ఎటూ వెళ్లలేని నేతలు మాత్రం ఆ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారన్న కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. అదీ కూడా అవుట్ డేట్ అయిన నేతలే ఎక్కువగా ఆ పార్టీలో కనిపిస్తున్నారు. ఓల్డ్ జనరేషన్ నేతలను ప్రజలు ఆదరిస్తారన్న గ్యారంటీ లేదు. అందుకే వారు పోటీ చేసి ఉన్న డబ్బులు ఖర్చు చేసుకోవడం వృధా అన్న నిర్ణయానికి దాదాపు వచ్చేశారు. పార్టీ కోసం ఏదైనా పార్లమెంటుకు పోటీ చేసి శాసనభ అభ్యర్థులపై ఆధారపడాలన్నది సీనియర్ నేతల ఆలోచనగా ఉంది.
ఎవరూ రారే...
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సీట్ల కోసం దరఖాస్తులను మూడు రోజుల క్రితం ప్రారంభించింది. అయితే పెద్దగా ఎవరూ కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు ఉత్సుకత చూపడం లేదు. దరఖాస్తులు తీసుకోవడానికే ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే ఆలస్యంగా అయినా వస్తారని ఆశగా చూస్తుంది ఆంధ్రరత్న భవన్. ఎందుకంటే.. ఇటు అధికార వైసీపీ, అటు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు తమకు సీటు నిరాకరిస్తే వారు కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలున్నాయి. అక్కడ సీటు దొరకని వాళ్లు మాత్రం ఇక్కడ అప్లికేషన్ల కోసం వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ నేతలు కూడా వెయిట్ చేస్తున్నారు.
టిక్కెట్ రాని వాళ్లు...
ప్రస్తుతానికి అయితే 175 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలమైన నేతలు లేరన్నది మాత్రం వాస్తవం. ఓట్లు చీల్చడానికి కొందరు, తమకు టిక్కెట్ నిరాకరించిన పార్టీని ఓడించడానికి పోటీ చేసే వారు కొందరుంటారు. అందులో హస్తం గుర్తు. జనంలో కొంత నానే గుర్తు పోట ీచేస్తే కొంత ఫలితం ఉండవచ్చేమోనని భావించి ఇటు వైపు నేతలు వచ్చే అవకాశముంది. అంతేతప్ప కొత్తగా ఆ పార్టీలో టిక్కెట్ కావాలంటూ వచ్చే వారు తక్కువేనని చెప్పాలి. అంతోటి దానికి స్క్రీనింగ్ కమిటీ కూడా అవసరం లేదు. అదే తెలంగాణలో రెండు రోజుల్లో 119 స్థానాలకు వెయ్యి అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఏపీలో రాకపోవడానికి కారణాలు ఏవైనా చెప్పాలా? షర్మిల చేతులు ఊపినా ... రంకెలు వేసినా.. దరఖాస్తుల అంకెల్లో మాత్రం మార్పులుండవు.