Gorantla : పెద్దాయన సీటుకు ఎసరు పెట్టేసిన పవన్

పవన్ చేసిన ప్రకటనతో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు కిందకు నీళ్లు వచ్చేశాయి.;

Update: 2024-02-20 13:40 GMT

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పర్యటన ముగిసింది. అయితే ఈ సందర్భంగా పవన్ చేసిన ప్రకటనతో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు కిందకు నీళ్లు వచ్చేశాయి. రాజమండ్రి నేతలతో మాట్లాడిన పవన్ కల్యాణ్ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేయడం ఖాయమని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, రాజమండ్రి రూరల్ సీట్లో పోటీ చేయడం ఖాయమని తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ పోటీలో ఉంటారని ఆయన ప్రకటించారు. అంటే జనసేన అభ్యర్థి పేరు ఖరారయిందని ఆయన తెలపడంతో ఈ సీటుపై క్లారిటీ వచ్చింది.

సీనియర్ నేతకు...
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇస్తామని చెప్పారు. అందుకే రూరల్ నియోజకవర్గంపై గోరంట్ల గట్టి ఆశలు పెట్టుకున్నారు. రాజమండ్రి పట్టణ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఖాయం కావడంతో ఇప్పుడు గోరంట్ల సీటు గాల్లో వేలాడుతున్నట్లయింది. సీనియర్ నేతగా ఉన్న బుచ్చయ్య చౌదరి తరచూ తన సీటు తనకే వస్తుందని ఆయన ధీమాగా చెబుతూ వస్తున్నారు. తన సీటును టచ్ చేసే వాళ్లు ఎవరూ లేరని కూడా అనేకసార్లు మీడియా సమాశాల్లో ఆయన చెప్పడం విశేషం. కానీ ఈరోజు పవన్ కల్యాణ్ ప్రకటనతో క్లారిటీ వచ్చింది.
పార్టీ ఆవిర్భావం నుంచి...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలోనే ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే పార్టీలో సీనియర్ నేత ఆయన. ఆయన సుదీర్ఘ కాలం నుంచి రాజమండ్రి నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును జనసేనకు కేటాయిస్తే ఆయనకు ఎక్కడకు పంపుతారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆదిరెడ్డి కుటుంబాన్ని రాజమండ్రి పార్లమెంటుకు పోటీ చేయించి, రాజమండ్రి పట్టణ నియోజకవర్గం సీటును గోరంట్లకు ఇచ్చే ఆప్పన్ ఒకటి ఉన్నప్పటికీ ఆదిరెడ్డి కుటుంబం పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలిసింది.
ఆప్షన్ ఒకటి ఉన్నా...
దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయంలో చంద్రబాబు ఏం చేయనున్నారన్న చర్చ టీడీపీలో మొదలయింది. పవన్ చెప్పారంటే అది చంద్రబాబు, పవన్ ల మధ్య జరిగిన చర్చల మధ్య కుదిరిన ఒప్పందమనే అనుకోవాల్సి ఉంటుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పార్లమెంటు నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేయించాలి. లేదంటే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ స్థానం ఇస్తామన్న హామీ ఇచ్చి బుచ్చన్నను బుజ్జగించాల్సి ఉంటుంది. మొత్తం మీద రాజమండ్రిలో పవన్ కల్యాణ్ పర్యటనతో ఒక విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. రాజమండ్రి రూరల్ సీటు నుంచి మాత్రం జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. మరి గోరంట్ల ఏం చేయనున్నారన్నది ఆసక్తికరం.


Tags:    

Similar News