Tdp, Janasena Alliance : పొత్తులకు ముందే... అందుకేనట.. లేకుంటే?
తెలుగుదేశం, జనసేన జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి
తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ సమావేశం రాష్ట్ర స్థాయిలో ఒకసారి ముగిసింది. పార్టీ అగ్రనేతలు పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు ఈ సమావేశంలో పాల్గొని పలు కీలక నిర్ణయాలపై క్లారిటీ తీసుకురాగలిగారు. ఆ సమావేశంలో నిర్ణయించిన దాని ప్రకారం నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర స్థాయిలో నేతలు కలసి పోయినా జిల్లా స్థాయి నేతల్లో ఏదైనా అనుమానాలు, అసంతృప్తులుంటే ఈ సమావేశాలను నిర్వహించుకోవడం ద్వారా తొలగించుకోవచ్చన్నది ఆలోచన. అందుకే ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జిల్లాల్లో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.
ఈరోజు ఐదు జిల్లాల్లో...
తొలిరోజు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన ప్రతినిధులతో సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్టీ నుంచి వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, ఎన్ఎండీ ఫరూక్ లు హాజరుకానున్నారు. జనసేన నుంచి బొమ్మిడి నాయకర్, కోన తాతారావు, టి. శివశంకర్, బోనబోయిన శ్రీనివాస యాదవ్, చిల్లపల్లి శ్రీనివాసరావులు పాల్గొనన్నారు. ఈ సమావేశాల్లో జిల్లా స్థాయిల్లో రెండు పార్టీల మధ్య సమన్వయం ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆ యా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయడానికి మార్గం సుగమమయ్యేలా ఈ సమావేశాలను ప్లాన్ చేశారు.
రానున్న ఎన్నికల్లో...
ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు కుదిరిన నేపథ్యంలో సీట్ల పంపకం తర్వాత ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేసినా ఒకరినొకరు సహకరించుకోవాలని నేతలు అంగీకారానికి రానున్నారు. తమ పార్టీకి చెందిన ఓట్ల బదిలీకి నేతలతో పాటు నియోజకవర్గాల్లోని ముఖ్యమైన కార్యకర్తలకు కీలక భూమిక పోషించాలని భావిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలోనూ ముఖ్యమైన నేతలను గుర్తించి వారి ఓటు బ్యాంకును సేఫ్ గా తమ కూటమికే బదిలీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నది ఈ సమన్వయ కమిటీల సమావేశం ప్రధాన ఉద్దేశం. అందుకే తొలుత జిల్లా స్థాయిలో ఈ సమావేశాలు జరుగుతున్నప్పటికీ తర్వాత నియోజకవర్గాల స్థాయిలో కూడా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీట్ల పంపిణీ తర్వాత అయితే?
ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేసినా ఒకరినొకరు సహకరించుకునేలా ఈ సమావేశాలు దోహదపడతాయని భావిస్తున్నారు. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు సూచన మేరకు జిల్లా స్థాయిలో నేటి నుంచి మూడు రోజుల పాటు సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. నేతలు ఇప్పటికైతే సీట్ల పంపకం కాలేదు కాబట్టి అన్నింటికి పాజిటివ్ గానే స్పందించే అవకాశముంది. సీట్ల పంపకం పూర్తయిన తర్వాత అసంతృప్తులు బయటపడతాయని ముందుగానే ఈ కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. అయితే ఎన్నికల సమయానికి ఇరు పార్టీలు ఒకరికొకరు సహకరించుకునేలా ఏర్పాటు చేసిన ఈ సమన్వయ కమిటీల సమావేశాలు ఏ మేరకు ప్రభావితం చూపుతాయన్నది చూడాల్సి ఉంది.