Revanth Reddy : ఏపీలో ఎన్నికల వేళ చంద్రబాబుకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి

ఏపీలో ఎన్నికల వేళ తెలంగాణ అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి ప్రసంగం జగన్ కు అనుకూలంగా ఉంది;

Update: 2024-02-09 12:25 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను రెండు ప్రాంతాల ప్రజలు నిశితంగా పరిశీలిస్తుంటారు. మరి తెలిసి చేశారో.. తెలియక చేశారో... లేక తన ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి చేశారో... కేసీఆర్ ను విమర్శించాలనుకున్నారో తెలియదు కానీ జగన్ కు ఒక రకంగా రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నట్లే అనిపించింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ ప్రసంగం మొత్తం ఏపీలో జగన్ ను ఆకాశానికెత్తుతూ సాగింది. ప్రాజెక్టులపై ఆయన మాట్లాడిన తీరు.. తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడును మాత్రం ఇరకాటంలోకి నెట్టేసినట్లేనన్నది వాస్తవం.

ప్రాజెక్టుల నిర్మాణంలో...
రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఏపీ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ కేసీఆర్ పట్టించుకోలేదనడం జగన్ ను ఒకరకంగా ఎన్నికల సమయంలో ఊతమిచ్చినట్లే అవతుంది. అలాగే రాయలసీమలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విస్తరణ చేపట్టినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదని, రాయలసీమలో ప్రాజెక్టులకు బీజం కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైనే పడిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ కు రాజకీయంగా ఉపయోగపడేవే. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కంటే జగన్ స్పీడ్ గా ఉన్నారని ఒకరకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనడం చంద్రబాబును ఆయన పార్టీని పొలిటికల్ గా ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా?
జగన్ ప్రాజెక్టులు కట్టారంటూ...
రోజా ఇచ్చిన పులుసు తిని వాళ్లిచ్చిన అలుసుతోనే కృష్ణా నది జలాలను తరలించుకు వెళ్లారనడం కానీ, సాగర్ డ్యామ్ పైకి ఏపీ పోలీసులు రావడం వెనక కేసీఆర్ హస్తం ఉందని చెప్పడం కానీ ఏపీకి మంచి చేసేవే. ఏపీలోని రైతులకు మేలు చేసేవే. అలాగే ఏపీలో జగన్ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతుంటే తెలంగాణలో రెండు టీఎంసీలను కూడా తరలించలేకపోయారనడం కూడా ఏపీ ముఖ్యమంత్రి కేపబులిటీని పెంచడమే. జగన్ మన ప్రాజెక్టులపై తుపాకీ పెట్టి నీటిని తరలించుకుపోయారని అని ఒకరకంగా జగన్ ను హీరోను చేసినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం తన ప్రభుత్వం తప్పిదం లేదని చెప్పుకోదలచుకున్నప్పటికీ అది పరోక్షంగా జగన్ కు సాయం చేసినట్లుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ప్రత్యర్థి కేసీఆర్ ను...
ముఖ్యంగా ఆంధప్రదేశ్ ఎన్నికల సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు జగన్‌కు ఉపయోగపడేవిగానే ఉన్నాయన్నది వాస్తవం. రాష్ట్రంలో తనకు ప్రత్యర్ధిగా ఉన్న కేసీఆర్‌పై విమర్శలు చేయబోయి అత్యధికంగా ఉన్న రైతులను జగన్‌కు అనుకూలంగా మలచి రేవంత్ తన గురువు చంద్రబాబు పార్టీ కిందకు నీళ్లు తెచ్చారన్న పొలిటికల్ కామెంట్స్ వినపడుతున్నాయి. నిజానికి రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కేసీఆర్. ఏపీ రాజకీయాలు ఆయనకు అనవసరం కావచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ ఏపీలో ఆయన తెలంగాణలో చేసిన కామెంట్స్ జగన్ కు ఉపయోగకరంగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వైసీపీ సోషల్ మీడియా వైరల్ లో చేయడంలో అంతరార్ధమిదే.


Tags:    

Similar News