Chandrababu : చంద్రబాబులో కాన్ఫిడెన్స్ పెరిగిందా... అందుకే అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నికలు కీలకం. ఏపీలో ఎన్నికలకు ఇంకా తొంభయి రోజులు మాత్రమే సమయం ఉంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నికలు కీలకం. ఏపీలో ఎన్నికలకు ఇంకా తొంభయి రోజులు మాత్రమే సమయం ఉంది. అంటే నిజంగా చూసుకుంటే పెద్దగా సమయం లేదనే చెప్పాలి. అయితే చంద్రబాబు మాత్రం ఈసారి గెలుపు తనదేనన్న విశ్వాసంతో ఉన్నారు. జనసేనతో పొత్తు కారణం ఒకటి కాగా... మరొకటి తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఆయనకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చి పెట్టాయి. అక్కడ సంక్షేమ పథకాలు కూడా పెద్దగా పనిచేయలేదు. అందుకే కేసీఆర్ ఓటమి పాలయ్యారు. మరోవైపు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది ఆ ఎన్నికల ద్వారా స్పష్టమయింది. అందుకే ఈసారి ఎన్నిక్లలో గెలుపు తమదేనన్న ధీమాతో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.
తెలంగాణలో చూసిన తర్వాత...
అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదని చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాతనే టీడీపీ అభ్యర్థులను ప్రకటించినా పెద్దగా నష్టం ఉండదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తొలుత ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని భావించినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పది రోజులకు ముందు కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ఆయనకు ఈ కొత్త ఆలోచన తెచ్చిపెట్టింది. చంద్రబాబు మామూలుగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో చిట్టచివరిగా చేస్తారు. ఎప్పుడూ అంతే. కాకపోతే ఈసారి ముందుగా చేయాలని అనుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని చూసిన తర్వాత తన ఆలోచనలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. అభ్యర్థుల కంటే ముందు ప్రజలను తన వైపునకు తిప్పుకోవడం మంచిదన్న ఆలోచనకు వచ్చారు.
నింపాదిగానే...
అందుకే అభ్యర్థుల ఎంపికలో నింపాదిగా నిర్ణయం తీసుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జనసేనతో పాటు వస్తే బీజేపీ లేదంటే.. కమ్యునిస్టులతో కూడా పొత్తు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే అవతలి వారికి ఛాన్స్ ఇచ్చినట్లవుతుందని, చివరి క్షణంలో ప్రకటిస్తే అప్పటికే ఎటూ వెళ్లలేక పార్టీకి మద్దతుగా నాయకులు నిలుస్తారని ఆయన అభిప్రాయపడుతున్నట్లు వినికిడి. అందుకే అభ్యర్థుల ఎంపికను హడావిడిగా చేయడం కంటే ఆలస్యంగా చేయడమే మంచిదన్న నిర్ణయానికి టీడీపీ అధినేత వచ్చినట్లు సమాచారం. అయితే ఖచ్చితంగా గెలిచే స్థానాలలో మాత్రం అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి వారిని ప్రచారం చేసుకోవాలని సూచించడం మరో మార్గంగా చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఖచ్చితంగా గెలిచే స్థానాలను గుర్తించి అక్కడి పార్టీ నేతలకు మాత్రం నేరుగా సంకేతాలను ఇవ్వనున్నారు.
త్యాగరాజులకు మాత్రం...
మరికొందరు మాత్రం ఈసారి త్యాగాలకు సిద్ధమవ్వాలని ముందు నుంచే చంద్రబాబు చెబుతున్నారు. తమ్ముళ్లూ.. త్యాగాలకు సిద్ధంగా ఉండండి అంటూ ఆయన పిలుపు నిస్తూ వెళుతున్నారు. పొత్తులో భాగంగా కోల్పోయే స్థానాల్లో అభ్యర్థులకు పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామన్న హామీని ఇవ్వనున్నారు. జనసేనతో పొత్తు ముందుగానే ఖరారవ్వడంతో కొందరు నేతలు తమకు టిక్కెట్లు రావని మానసికంగా సిద్ధమయ్యారు. అయితే అధినాయకత్వం మరోచోట తమకు అవకాశం ఇస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరినీ చంద్రబాబు దూరం చేసుకోరని, ఖచ్చితంగా సీటును త్యాగం చేసిన వారికి గుర్తుపెట్టుకుని మరీ మంచిపదవులు ఇస్తామని చెబుతున్నారు. సాధ్యమయినంత వరకూ ఎవరూ పార్టీని వీడకుండా చంద్రబాబు వారితో నేరుగా మాట్లాడి బుజ్జగిస్తారని తెలిసింది.