Revanth Reddy : రేవంత్ రెడ్డి డెసిషన్.. అప్పుడే మంత్రి వర్గ విస్తరణ.. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణను వాయిదా వేశారన్న ప్రచారం జరుగుతుంది

Update: 2024-01-30 04:17 GMT

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డి నిర్ణయంతో విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. రేవంత్ ప్రతిపాదనకు పార్టీ హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు కావస్తుంది. రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురిని రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ త్వరలోనే జరగనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొంత ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

మరో ఆరుగురిని...
రేవంత్ రెడ్డితో పాటు పన్నెండు మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖలతో మంత్రి వర్గం ఏర్పాటయింది. మరో ఆరుగురిని త్వరలో కేబినెట్ లోకి తీసుకుంటామని అప్పట్లో పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మైనారిటీలకు అవకాశం ఇచ్చే అవకాశముందని కూడా వార్తలొచ్చాయి. అంతేకాకుండా పార్టీ సీనియర్ నేతలు కొందరిని ఎమ్మెల్సీలు అయినా వారిని కూడా కేబినెట్ లోకి తీసుకుంటారని అన్నారు.
హైకమాండ్ తో...
కానీ ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ పెద్దలతో చర్చించినట్లు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణను పార్లమెంటు ఎన్నికల తర్వాతనే చేపట్టడం మంచిదని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. అందుకు హైకమాండ్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికలకు ముందు మంత్రి వర్గ విస్తరణ చేపడితే ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోయి పార్లమెంటు ఎన్నికల్లో సక్రమంగా పనిచేయకపోవచ్చన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. అందుకే మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో వద్దని ఆరుగురిని ఒకేసారి పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత చేయవచ్చని రేవంత్ చేసిన సూచనకు పార్టీ అధినాయకత్వం సమ్మతించినట్లు సమాచారం.
రాజ్యసభ ఎన్నికలు...
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు కూడా ఉండటం మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడటానికి మరొక కారణంగా చెబుతున్నారు. వచ్చే నెల 27న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. అన్నీ పూర్తయితే నింపాదిగా ఆలోచించి మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని సీినియర్ నేతలు కూడా చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యధిక స్థానాలలో గెలవాలంటే ఇప్పడు సరైన సమయం కాదని కూడా రేవంత్ అభిప్రాయపడుతున్నారు. అందుకే మంత్రి వర్గ విస్తరణ మరో మూడు నెలలకు పైగానే సమయం పట్టే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఆశావహులు ఎదురు చూడాల్సిందే.


Tags:    

Similar News