చంద్రబాబు నెత్తిన పళనిస్వామి పాలు పోశారా?
దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏపీలో టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధమవుతుంది
దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కర్ణాటకలో వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నా ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. దక్షిణాదిన మరో కీలక రాష్ట్రమైన తమిళనాడులో అన్నాడీఎంకే కమలం కౌగిలి నుంచి బయటకు వచ్చేసింది. తాము పొత్తు నుంచి తప్పుకుంటున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో జనసేన, కర్ణాటకలో జేడీఎస్ రెండే బీజీపీకి మిత్రపక్షాలుగా ఉన్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన సీట్ల సంఖ్య మరింత పెంచుకోవాలంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు దిగక తప్పని పరిస్థిితి భారతీయ జనతా పార్టీది.
అదే కలసి వచ్చేదిగా...
అదే ఇప్పుడు ఏపీలో చంద్రబాబుకు కలసి వచ్చేదిగా కనిపిస్తుంది. తెలంగాణలో ముందు ఎన్నికలు జరుగుతున్నా అక్కడ పొత్తు ప్రస్తావన లేకుండానే ఒంటరిగానే బరిలోకి దిగాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. గెలిచిన తర్వాత మద్దతు కోసం చూసుకోవచ్చులే అన్న ఆలోచన కావచ్చు. కేసీఆర్‌కు కాంగ్రెస్ బద్ధశత్రువు కాబట్టి ఆ పార్టీకి మద్దతు ప్రకటించరన్న విశ్వాసమూ అవ్వొచ్చు. అందుకే ఇక్కడ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. గత ఎన్నికలంటే నాలుగైదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటే చాలని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా పరవాలేదన్న ధోరణిలో ఆ పార్టీ నేతలు కనిపిస్తున్నారు. పైకి మోదీ నుంచి నేతలందరూ బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నా లోపల మాత్రం ఇద్దరికీ మంచి రిలేషన్ ఉందన్న విషయాన్ని విమర్శకులు సయితం అంగీకరిస్తున్నారు.
ఏదో ఒక పార్టీతో...
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అది కాదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏపీలో అస్సలు ఓటు బ్యాంకు లేదు. జగన్ తో నేరుగా పొత్తు సాధ్యపడదు. కలసి పోటీ చేయాలంటే అది టీడీపీతోనే సాధ్యం. తమకంటూ కొన్ని స్థానాలు వస్తాయి. పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాలుంటాయి. అంతేకాకుండా దక్షిణాదిన పళనిస్వామి హ్యాండ్ ఇవ్వడంతో చంద్రబాబుతో చేయికలపడమే బెటర్ అన్న అభిప్రాయంలో కేంద్ర నాయాకత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ విషయంలో ఆయన బయటకు వచ్చిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశముందన్నది హస్తిన వర్గాల ద్వారా తెలుస్తోంది.
రాష్ట్ర నేతలు కూడా...
బీజేపీకి కూడా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. తమ వెంట బలమైన మిత్రులున్నారని చెప్పుకోవడం కోసమైనా సైకిల్ ఎక్కక తప్పదన్నది అంచనాలు వినపడుతున్నాయి. అంతేకాదు... సోము వీర్రాజును మార్చి పురంద్రీశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. ఎక్కువ మంది రాష్ట్ర బీజేపీ నేతలు కూడా టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉండటంతో త్వరలోనే హస్తిన నుంచి పొత్తు ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్లి పరిస్థితిని వివరిస్తే కమలనాధుల నుంచి సానుకూల స్పందన వస్తుందని చెబుతున్నారు. అయితే దీనికి కొంత సమయం పట్టవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేయడం ఖాయమన్న విశ్లేషణలు మాత్రం నిజం కాబోతున్నాయి.