Rayapati : రాయపాటి స్విచ్ ఆన్ చేస్తున్నారా? అదే జరిగితే గుంటూరు రాజకీయం గరంగరమేనా?

రాయపాటి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన వైసీపీ వైపు చూస్తునట్లు సమాచారం. త్వరలో జగన్ ను కలవనున్నారని తెలిసింది;

Update: 2024-01-15 06:05 GMT

రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాలో సీనియర్ నేత. ఆయన మొన్నటి వరకూ టీడీపీలో ఉన్నారు. కానీ యాక్టివ్ గా లేరు. ఇటీవల వరకూ గుంటూరు పాలిటిక్స్ ను శాసించిన రాయపాటి సాంబశివరావు తన వారసులను రాజకీయంగా ఎదిగేలా చూడాలని భావించారు. కానీ ఆయన కల నెరవేరేటట్లు కనిపించడం లేదు. టీడీపీ రాయపాటి కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఆయనను పట్టించుకోవడం లేదు. దీంతో రెండు రోజుల క్రితం ఆయన కుమారుడు రాయపాటి రంగారావు పార్టీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడమే కాదు.. చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆషామాషీ నేత కాదు...
రాయపాటి సాంబశివరావు ఆషామాషీ నేత కాదు. 1982లోనే మొదటి సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలే. అతి చిన్న వయసులో పెద్దల సభలో అడుగుపెట్టిన రాయపాటి సాంబశివరావు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ లో ఆయన తిరుగులేని నేతగా దశాబ్దాల పాటు ఏలారనే చెప్పాలి. 1996, 1998, 2004, 2009 లో కాంగ్రెస్ పార్టీ తరుపున పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2014లో రాష్ట్ర విభజనతో ఆయన కాంగ్రెస్ ను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 2014లో ఆయన నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2019లో ఆయన టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీలో క్రియాశీలకంగా మారదామనుకున్న రాయపాటికి అనారోగ్యం, వృద్ధాప్యం కొంత ఇబ్బందిగా మారింది. ఇక తాను రాజకీయాలు చేయలేని భావించి వారసులను తీసుకొచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు.
ఎక్కడో ఒక చోట..
తన వారసుడు రాయపాటి రంగారావుకు ఆయన సత్తెనపల్లి టిక్కెట్ ను కోరారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ తన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణను ఇన్ ఛార్జిని చేశారు. సత్తెనపల్లి కాకపోతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ అయినా ఇవ్వమని కోరారు. కానీ ఆ సీటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోసం రిజర్వ్ చేసినట్లు చెప్పినట్లు తెలిసింది. తెనాలి సీటును పొత్తులో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు కేటాయించాల్సి రావడంతో ఆలపాటిని గుంటూరు పశ్చిమకు పంపాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలిసింది. దీంతో రాయపాటి కుటుంబానికి ఈసారి టిక్కెట్ లేదన్న సంకేతాలు బలంగా వెళ్లాయి.
అక్కడ కూడా...
నరసరావుపేట పార్లమెంటు స్థానం కోరినా అక్కడి నుంచి బీసీ నేతను బరిలోకి దించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. యనమల రామకృష్ణుడు అల్లుడికి ఆ సీటు ఖరారయిందని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు ఈసారి టిక్కెట్లు ఇవ్వరని తేలిపోవడంతో రాయపాటి రంగారావు పార్టీ నుంచి క్విట్ అయినట్లు చెబుతున్నారు. ఆయన త్వరలోనే వైఎస్ జగన్ తో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ తో మాట్లాడిన తర్వాత తన రాజకీయ భవిష్యత్ పై ప్రకటన చేస్తానని రాయపాటి రంగారావు చెబుతున్నారు. జగన్ పార్టీలోకి వెళ్లినా ఆయనకు పోటీ చేసే అవకాశం లభిస్తుందా? లేదా? అన్నది సందేహమే. మరి రాయపాటి కుటుంబీకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News