Revanth Reddy : కరెంట్ బిల్లులు కట్టాలా? వద్దా? రేవంతన్నా...?

డిసెంబరు నెల విద్యుత్తు బిల్లుల చెల్లింపుపై తెలంగాణాలో సందిగ్దత నెలకొంది

Update: 2023-12-27 12:39 GMT

electricity billsintelangana

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు పదే పదే ఇప్పటికీ అందరి చెవుల్లో మారుమోగుతున్నాయి. అందులో విద్యుత్తు బిల్లులు ఒకటి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి వచ్చే నెల ఎవరూ విద్యుత్తు బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని ఖరాఖండీగా చెప్పేశారు.

ఉచిత విద్యుత్తు ఇస్తామని...
గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును ఇస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వైపు పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ హామీని ఎప్పుడు అమలు చేస్తారన్న దానిపై ప్రజల్లో ఇంకా సందిగ్దత నెలకొంది. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఈ నెల విద్యుత్తు బిల్లులు చెల్లించాలా? వద్దా? అన్న సందేహంలో ప్రజలున్నారు. స్వయాగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పినందున తాము ఈ నెల విద్యుత్తు బిల్లును చెల్లించబోమని పలువురు తెగేసి చెబుతున్నారు.
మొదటి వారంలోనే...
ప్రతి నెల మొదటి వారంలో విద్యుత్తు బిల్లులు వస్తాయి. దానిని చెల్లించడానికి నెలాఖరు వరకూ గడువు ఉంటుంది. అంటే విద్యుత్తు బిల్లులు రావడానికి కేవలం పది నుంచి పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది. రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించిన వారు బిల్లుల చెల్లింపుపై నేటికి ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఎవరికి ఇస్తారు? అందుకు అర్హులైన లబ్దిదారులు ఎవరు? అన్న దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
అర్హులెవరు?
తెల్లరేషన్ కార్డు దారులకే ఈ ఉచిత విద్యుత్తును ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. తెల్ల రేషన్ కార్డులు మరిన్ని ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రకటించారు. మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోతే రెండు వందల యూనిట్లు వినియోగించిన వారు ఎవరూ విద్యుత్తు బిల్లులు కట్టేందుకు ముందుకు రారు. అందులోనూ చలికాలం కావడంతో సహజంగానే విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. అందుకే రెండు వందల యూనిట్లు లోపు వినియోగించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తేనే బిల్లులు చెల్లించే అవకాశముంది.
Tags:    

Similar News