YSRCP : కాంట్రవర్సీ ఫెలోస్... సరైన సమయంలో బటన్ నొక్కేశారుగా

ఆరోపణలు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా జగన్ పక్కన పెట్టేశారు. వారు మంత్రులయినా.. ఏ సామాజికవర్గమయినా సరే. ఉపేక్షించలేదు.

Update: 2024-01-03 05:30 GMT

those accused were ruthlessly sidelined by ys jagan

ఆరోపణలు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా జగన్ పక్కన పెట్టేశారు. వారు మంత్రులయినా.. ఏ సామాజికవర్గమయినా సరే. ఎవరినీ జగన్ ఉపేక్షించలేదు. ప్రజల్లో నెగిటివ్ గా నానిన నేతలను మాత్రం ఆయన పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది. ఇందుకు హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ఉదాహరణ అని చెప్పుకోవాలి. గోరంట్ల మాధవ్ పోలీసు అధికారిగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఆయన తంతే గారెల బుట్టలో పడినట్లు ఏకంగా పార్లమెంటు టిక్కెట్ పట్టేశారు. ఆయన హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా గెలిచి రాజకీయ నాయకుడిగా మారతారని భావించారు. కానీ ఆయన పూర్వం ధరించిన డ్రెస్ ను వదిలేసినా.. ఆ క్రౌర్యాన్ని మాత్రం వదిలిపెట్టలేకపోయారు.

తల దించుకునేలా...
ఎన్నో కాంట్రవర్సీలు.. ఒకటి కాదు రెండు కాదు.. చెప్పుకుంటూ పోతే.. హిందూపురం ఓటర్ల జాబితా అంత ఉంటుంది. గోరంట్ల మాధవ్ మాట్లాడితే ఏదో ఒక వివాదం చెలరేగినట్లే అవుతుంది. ఆయన వీడియో ఒకటి పార్టీని తలదించుకునేలా చేసింది. పైగా మాధవ్ ఈసారి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తానని చెప్పడం కూడా అంతే వివాదంగా పార్టీలో మారింది. తరచూ పత్తికొండ నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ తన సామాజికవర్గం నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీకి కూడా తలనొప్పిగా మారారు. అయితే అన్నీ చూస్తూ మౌనంగా ఉన్న జగన్ మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. సమయం వచ్చినప్పుడు చూసి మరీ నొక్కేశారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా శాంతమ్మను నియమించారు.
పేకాట నుంచి భూ ఆక్రమణల వరకూ...
ఇక మరో కాంట్రవర్సీ నేత, మంత్రి గుమ్మనూరి జయరాం. ఈయన ఆలూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి విజయం సాధించి మంత్రిగా జగన్ కేబినెట్‌లో స్థానం సంపాదించారు. అయితే ఆయన కూడా అంతా వివాదాల మయమే. భూముల ఆక్రమణ దగ్గర నుంచి పేకాట శిబిరాల నిర్వహణ వరకూ నిత్యం ప్రతిపక్షాల నోటిలో నానారు. ఎంతగా అంటే గుమ్మనూరి జయరాం కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారని చెబుతున్న పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేసి మరీ పట్టుకోవడం వివాదంగా మారింది. దీంతో పాటు కార్మికశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఒక మల్టీ నేషనల్ కంపెనీ నుంచి ఖరీదైన కారును గిఫ్ట్‌గా పొందినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు బలంగా వినిపించాయి. జగన్ ను కలిసి తన మీద వచ్చిన ఆరోపణలకు వివరణలు ఇచ్చుకున్నారు గుమ్మనూరి జయరాం.
కర్నూలు పార్లమెంటుకు...
అయితే ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించలేదు. తన కేబినెట్ లోనే కొనసాగించారు. చివరకు టిక్కెట్ విషయం వచ్చే సరికి బటన్ నొక్కేశారు. అంతే గుమ్మనూరి జయరాంను కర్నూలు పార్లమెంటు స్థానానికి పంపించేశారు. ఒకరకంగా ఇది గుమ్మనూరి జయరాం డిమోషన్ అని చెప్పాలి. కాంట్రవర్సీలకు పాల్పడకుండా ఉండి ఉంటే మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవిని దక్కించుకుని ఉండేవారు. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకతతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెడ్డపేరు తెచ్చిన ఈ ఇద్దరు నేతలను జగన్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయడం పార్టీకి మంచిదే. వ్యక్తిగతంగా వారిద్దరికీ రాజకీయంగా నష్టం జరిగినా.. పార్టీ క్యాడర్ కు మాత్రం ప్రయోజనమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద వివాదాలు ఎక్కువగా ఈ ఐదేళ్లలో మూటగట్టుకున్న ఈ ఇద్దరు నేతలకు జగన్ ఝలక్ ఇచ్చారనే చెప్పాలి.


Tags:    

Similar News