Ys Jagan : మ్యానిఫేస్టోను "సిద్ధం" చేసిన జగన్... 18న సీమలో విడుదల
వైసీపీ అధినేత జగన్ ఈ నెల 18వ తేదీన రాప్తాడు బహిరంగ సభలో మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు;
మ్యానిఫేస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరచూ చెప్పే వైసీపీ అధినేత జగన్ దానిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీన మ్యానిఫేస్టోను విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు. రాయలసీమలో జరగనున్న సిద్ధం సభలో ఈ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. 18వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో సిద్ధం బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే జగన్ మ్యానిఫేస్టోను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఆయనతో పాటు ఒక టీం మ్యానిఫేస్టో రూపకల్పనలో కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే టీడీపీ తొలి విడత మ్యానిఫేస్టో విడుదల చేయడంతో జగన్ మ్యానిఫేస్టోలో ఏ అంశాలుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.
రాప్తాడు సభలో...
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు తన తొలి విడత మ్యానిఫేస్టోను విడుదల చేశారు. ఆరు గ్యారంటీలను ప్రజల ముందు ఉంచారు. మహిళలు, యువత, బీసీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా చంద్రబాబు తొలి విడత మ్యానిఫేస్టో విడుదలయింది. దీనికి సూపర్ సిక్స్ గా నామకరణం చేశారు. మలి విడత మ్యానిఫేస్టో ప్రకటన కూడా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. పొత్తులతో ఉన్న భాగస్వామ్య పార్టీలతో కలసి చంద్రబాబు రెండో విడత మ్యానిఫేస్టోను అతి త్వరలోనే విడుదల చేయనున్న నేపథ్యంలో జగన్ ఈ నెల 18వ తేదీన రాప్తాడులో జరిగే సిద్దం సభలో విడుదల చేయనున్న మ్యానిఫేస్టోలో ఏ ఏ అంశాలుంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
రైతు రుణమాఫీ....
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేశామని చెప్పుకునే జగన్ ఈసారి ఎన్ని హామీలను ప్రజలకు ఇస్తారన్నది అందరిలోనూ ఆసక్తిరేపుతుంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా 2.50 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారులకు అందచేశామని చెబుతున్న జగన్ సర్కార్ ఈసారి రైతులు, ఉద్యోగులు, మహిళలు లక్ష్యంగా మ్యానిఫేస్టోను రూపొందిస్తున్నట్లు తెలిసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉండే అవకాశముందని తెలిసింది. అలాగే రెండు లక్షల వరకూ రైతు రుణ మాఫీని జగన్ ప్రకటిస్తారని అంటున్నారు. ఉద్యోగులకు కూడా వరాలను ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం.
సామాజికవర్గాల వారీగా...
సామాజికవర్గాల వారీగా ఆకట్టుకునే విధంగా ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీసీ మంత్రం జపిస్తున్న వైఎస్సార్ పార్టీ ఈ మ్యానిఫేస్టోలో కూడా వారికే అగ్రస్థానం కల్పిస్తూ అనేక హామీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు మైనారిటీలు, ఎస్సీల సంక్షేమంతో పాటు ప్రాంతాల వారీగా కొన్ని హామీలను వైసీపీ మ్యానిఫేస్టోలో చోటు కల్పించాలని నిర్ణయించారు. మ్యానిఫేస్టో ఒక పేజీ కంటే ఎక్కువ ఉండకూడదని మాత్రం జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఒక టీం మాత్రం దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మ్యానిఫేస్టో రూపకల్పనకు జగన్ నడుంబిగించారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ మ్యానిఫేస్టో కోసం ఇటు రాజకీయ పార్టీలేకాదు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.