మాజీ ఎంపీ రాయపాటి, ట్రాన్స్‌ట్రాయ్ డైరెక్టర్ ఇంట్లో ఈడీ సోదాలు

మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్;

Update: 2023-08-01 05:01 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ విభాగం మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈడీ అధికారులు ట్రాన్స్ ట్రాయ్ పవర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ మాలినేని సాంబశివరావుకు చెందిన నివాసాలు, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించారు. 9,394 కోట్ల రుణ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. ఇది దేశంలోని అతిపెద్ద లోన్ ఫ్రాడ్ లలో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్, గుంటూరు సహా తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహించామని, రాయపాటి ఇతర ప్రమోటర్ల కార్యాలయాలు నివాసాల్లో సోదాలు జరిగాయని ఈడీ వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని కోట్లాది రూపాయల పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొదట కాంట్రాక్టర్‌గా ఉంది. నిందితులు నిధులను దారి మళ్లించేందుకు పనిమనిషి, స్వీపర్లు, డ్రైవర్ల పేర్లను డైరెక్టర్లుగా ఉపయోగించుకుని బోగస్ కంపెనీలను సృష్టించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెకోరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
నిందితులు పద్మావతి ఎంటర్‌ప్రైజెస్, యూనిక్ ఇంజనీర్స్, బాలాజీ ఎంటర్‌ప్రైజెస్, రుత్విక్ అసోసియేట్స్ వంటి సంస్థలను స్థాపించి, వాటి ద్వారా రూ.6,643 కోట్లు స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలింది. కెనరా బ్యాంకుతో పాటు మరో 13 బ్యాంకుల నుంచి కంపెనీ రూ.9,394 కోట్ల రుణం పొందినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో తేలింది. ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్, కంపెనీ సీఎండీ చెరుకూరి శ్రీధర్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీష్‌లపై సీబీఐ పలు సెక్షన్స్ కింద గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ట్రాన్స్‌స్ట్రాయ్ ఖాతా నుంచి రూ.7,153 కోట్లు బదిలీ అయినట్లు ఆడిట్ వెల్లడించింది. ఈ మొత్తంలో ఎనిమిది మంది విక్రేతల నుంచి రూ.6,202 కోట్లు ట్రాన్స్‌స్ట్రాయ్ ఖాతాకు తిరిగి వచ్చాయి. వాటిని పలు అకౌంట్లకు బదిలీ చేశారు. ప్రమోటర్ల ఖాతాల్లోకి కూడా రూ.350 కోట్లు బదిలీ అయ్యాయి.
ట్రాన్స్‌స్ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2001లో స్థాపించారు. సివిల్ కాంట్రాక్టులు, రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హైవే నిర్మాణాలలో భాగమైంది. 2013 నుండి 2014లో కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంక్, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ సహా పలు బ్యాంకుల కన్సార్టియం నుండి రుణాలు తీసుకున్నారు.


Tags:    

Similar News