జవాబు దొరకని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలైన తెలుగుదేం, జనసేనల మధ్య పొత్తు కుదిరి దాదాపు పది రోజులకు పైగానే పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలైన తెలుగుదేం, జనసేనల మధ్య పొత్తు కుదిరి దాదాపు పది రోజులకు పైగానే పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ కల్యాణ్ తాను బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని ప్రకటించారు. త్వరలోనే కో-ఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని కార్యాచరణతో ముందుకు వెళతామని చెప్పారు. అయితే ప్రకటన చేసి పది రోజులు దాటినా ఇంకా ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదు.
పది రోజులు దాటుతున్నా…
ఒకవైపు పవన్ కల్యాణ్ సమన్వయ కమిటీకి నాదెండ్ల మనోహర్ ను తమ పార్టీ తరుపున సభ్యుడిగా నియమించారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అలాంటి ప్రక్రియ మొదలు కాలేదు. చంద్రబాబు జైలులోనే ఉండటం, లోకేష్ ఢిల్లీలో ఉన్నందున పొత్తు ప్రకటించి పది రోజులు దాటుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు జైలులో ఉండగానే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రకటించాల్సిన రెండు పార్టీలు మౌనం వహించడం కూడా చర్చనీయాంశంగా మారాయి.
కార్యాచరణ ఏదీ?
చంద్రబాబు జైలులో ఉండగానే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీలు కార్యక్రమాలు చేపడితేనే క్యాడర్ తో పాటు జనంలోనూ కొంత సానుకూలత ఏర్పడుతుంది. కానీ పార్టీలు కార్యాచరణకు ముందుకు రాకపోవడానికి కారణాలేంటన్న చర్చ ఇరు పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ముందుగా పొత్తు ప్రకటన చేయడంతో ఇక మనం తొందరపడాల్సిన పనిలేదవన్నది టీడీపీ ఆలోచనగా ఉంది. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందనుకున్నా టీడీపీ సమావేశాల మొత్తాన్ని బహిష్కరించింది.
చెప్పాల్సిందెవరు?
అయితే జనసేనలో మాత్రం కొంత అసహనం కనపడుతుంది. తాము పొత్తును ప్రకటించిన తర్వాత టీడీపీ నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనలు రాకపోగా, సమన్వయ కమిటీని కూడా ప్రకటించకపోవడాన్ని వారు తప్పు పడుతున్నారు. పవన్ తొందరపడి పొత్తు ప్రకటన చేయకపోతే వారే ముందుకు వచ్చే వారని జనసైనికుల అభిప్రాయంగా ఉంది. ఇప్పుడు బీజేపీ పెద్దలకు ఈ పొత్తు విషయం చెప్పాల్సిన బాధ్యతను కూడా పవన్ తన భుజాన వేసుకున్నారు. కానీ అది కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పవన్ ఢిల్లీ వెళ్లే ప్రయత్నమే చేయలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీ వెళితే అందరూ అందుబాటులో ఉండే అవకాశముంది.