మద్యం: ప్రభుత్వానికి ఆదాయం

ప్రభుత్వాలకు ఆదాయం చాల చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఒకప్పుడు భూమి శిస్తు ఉండేది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు క్రమంగా ఇటువంటి ఆదాయానికి దూరం అయ్యాయి. ఆధునిక భారతంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం ఆదాయం మీద ఆధారపడుతున్నాయి.

Update: 2023-10-27 09:29 GMT


ప్రభుత్వాలకు ఆదాయం చాల చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఒకప్పుడు భూమి శిస్తు ఉండేది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు క్రమంగా ఇటువంటి ఆదాయానికి దూరం అయ్యాయి. ఆధునిక భారతంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం ఆదాయం మీద ఆధారపడుతున్నాయి. ప్రజలను పీడించి, పిండి వసూలు చేసే పన్నులలో మద్యం మీద పన్ను కూడా ఉంటుంది. ఈనాటి ప్రభుత్వాలు ప్రజలను వస్తు వినియోగానికి బానిసలుగా మార్చి తద్వారా వచ్చే ఆదాయం (ఎటువంటి ఆదాయమైన) తీసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రజల ఆస్తులను అమ్మి, ప్రైవెటికరణ చేస్తూ, పేదల మీద ఖర్చు పెట్టినట్టు నటిస్తూ, సంపద మార్పిడిలో కేవలం కొందరికే ప్రయోజనం కలిగించే విధానాలు విడనాడడం లేదు. జిఎస్టి వచ్చినాక వస్తువుల మీద, సేవల మీద పన్నులు వసూలు చేస్తూ, వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, సమాజంలో కొనగలిగే శక్తి ఉన్నవాడిదే రాజ్యాంగా మారుస్తున్నారు. ప్రభుత్వం ఉన్నదే సమానత్త్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని, న్యాయాన్ని కాపాడడానికి అనే మూల సూత్రం మరిచి ఆధునిక ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి, నిధుల సేకరణ పేరు మీద అనేక రూపాలలో ప్రజల నుండి వసూలు చేస్తున్నారు. దమ్మున్నవారికి, ధనికులకు రాయితీలు ఇస్తూ, నోరు లేని వారి దగ్గర మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పేదలకు పించన్లు, నగదు ఇస్తున్న పథకాలు ప్రకటిస్తూ, ఇంకొక వైపు పేదలను, సామాన్య ప్రజలను మత్తుకు బానిసలుగా చేసి, ప్రభుత్వ ఆదాయం పెంచుతున్నారు. ఎక్సైజ్ సుంకం ద్వార రాష్ట్రాల ఆదాయం 1970-71లో రూ.194 కోట్లు ఉండగా, 2022-23 నాటికి రూ. 2,51,314 కోట్లు అయ్యింది.

ప్రస్తుతం భారతదేశంలో ఆల్కహాల్ మార్కెట్ విలువ రూ.3,95,422 కోట్లు. 2021-25 కాలంలో వార్షికంగా 9% పెరుగుతుందని అంచనా. ఈ మార్కెట్ పెరిగితే, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఇంటర్నేషనల్ వైన్ అండ్ స్పిరిట్స్ రికార్డ్ (ఐడబ్ల్యుఎస్ఆర్) డ్రింక్స్ మార్కెట్ విశ్లేషణ ప్రకారం, భారతదేశంలో, వివిధ రకాల మద్యంలో, విస్కీ బ్రాండ్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా విస్కీ వినియోగం మన దేశంలోనే అవుతుంది. IMFL అనబడే విదేశీ (స్వదేశంలో ఉత్పత్తి) మద్యం మార్కెట్ వాటా 62.3%. ఈ వాటా కూడా ఒక 11 కంపెనీల చేతిలో ఉన్నది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్), న్యాయ సంస్థ పీఎల్ఆర్ చాంబర్స్ ఇటీవల చేసిన అధ్యయనంలో అంతర్జాతీయ ప్రయాణాలు పెరిగిన దరిమిలా భారతీయ వినియోగదారుల మద్యపాన అలవాట్లు మారుతున్నాయి. ఇతర మార్కెట్ల బ్రాండ్ల ఉపయోగం కూడా పెరిగింది. పట్టణాలలో, నగరాలలో మద్యం వినియోగం అధికంగా ఉన్నది.

కేంద్రం పరిధిలో మద్యం అమ్మకాల పన్ను రాదు. రాష్ట్రాలు ఈ పన్నును జిఎస్టి పరిధిలోకి రాకుండా మూకుమ్మడిగా అడ్డుకున్నాయి. ఇదే ఐక్యత స్ఫూర్తి చేనేత ఉత్పత్తులకు మినహాయింపు సాధించడంలో కానరాదు. ఈ దశాబ్ద కాలంలో, ఒకరిని చూసి ఇంకొకరు రాష్ట్రాలు పోటి పడి మద్యం అమ్మకాల పన్ను నుంచి ఆదాయం పెంచుకుంటున్నాయి. అధికార బృందాలు ‘అధిక’ ఆదాయం సాధించిన రాష్ట్రాలకు వెళ్లి, అక్కడి విధానాలు పద్దతులు నేర్చుకుని తమ దగ్గర అమలు చేస్తున్నారు. దేశంలో 75 శాతం మద్యం వినియోగం కేవలం 12 రాష్ట్రాల్లోనే ఉన్నది. అవి, 5 దక్షిణాది రాష్ట్రాలు, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. అయితే, ఈ 12 రాష్ట్రాలలో మొత్తం కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు / మరణాలలో 85 శాతం.

అనేక నివేదికల ప్రకారం, మద్యం ఆదాయంలో దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఐదు దక్షిణాది రాష్ట్రాలు మద్యంపై ఎక్సైజ్ సుంకం ద్వారా 10-15 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని, అయితే మొత్తం దేశీయ వినియోగంలో దాదాపు 45 శాతం ఈ ఐదు రాష్ట్రాలలో ఉందని క్రిసిల్ నివేదిక తెలిపింది. వివిధ నివేదికలను బట్టి ఎక్కడ జీడీపీ (రాష్ట్ర స్థూల ఆదాయం) ఎక్కువ ఉంటుందో అక్కడ మద్యం వినియోగం పెరుగుతున్నది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. మెట్రో నగరాలు ఉన్న రాష్ట్రాలలో విదేశీ మద్యం (దేశీయంగా ఉత్పత్తి) వినియోగం పెరిగింది. ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఈ బాటన నడవడానికి వెనుకబడ్డ రాష్ట్రాలు ఉత్సాహం చూపుతున్నాయి. ఈ ఆదాయం కొరకు అవసరమైన ‘అభివృద్ధి’ విధానాలు అమలు చేస్తున్నారు.

మద్యం మీద ఆధారపడ్డ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల కొన్ని నెలలు అగమ్యగోచరంగా మారింది. కాని, తదుపరి పూర్వ స్థితికి వచ్చాయి. కోరోన బారిన పడిన ప్రజలు ఒక దశలో వైరాగ్య స్థితికి చేరుకోవడంతో మద్యం వినియోగం కూడా తరువాతి కాలంలో పెరిగింది. ఆదాయ శాతం పరంగా తమిళనాడు, కేరళ చెరో 15 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, కేరళకు మద్యంపై పన్ను ఒక్కటే అతిపెద్ద ఆదాయ వనరు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో 11 శాతం, తెలంగాణకు 10 శాతం చొప్పున రెవెన్యూ వాటా ఉందని నివేదిక పేర్కొంది. పన్నుల ఆదాయంలో 12 శాతంతో మద్యం ఆదాయంలో ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నది.

తమిళనాడుకు మరో ప్రత్యేకత ఉంది - దేశంలో అత్యధిక మద్యం వినియోగం ఇక్కడే అవుతున్నది. ఇది జాతీయ అమ్మకాలలో 13 శాతం. కర్ణాటక 12 శాతంతో తరువాతి స్థానంలో ఉన్నది. జాతీయ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ కు 7 శాతం, తెలంగాణ 6 శాతం, కేరళ 5 శాతం ఉన్నాయి.

ఢిల్లీలో 2022-2023లో మద్యం అమ్మకాలు ద్వార రూ.9,454 కోట్లు (945.5 మిలియన్ పౌండ్లు) వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది - స్థానిక స్పిరిట్స్ బ్రాండ్ల నుంచి రూ.700 కోట్లు (70 మిలియన్ పౌండ్లు), దిగుమతుల ద్వారా రూ.8,754 కోట్లు (875.5 మిలియన్ పౌండ్లు). అంతకుముందు సంవత్సరాల్లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన రూ.6,000 కోట్ల (600 మిలియన్ పౌండ్లు)తో పోలిస్తే ఇది 57.6% అధికం.

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో 2019-20తో పోలిస్తే మద్యం అమ్మకాల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరానికి 26.14 శాతం అధిక ఆదాయం వచ్చింది. మద్యంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారా 2019-20లో రూ.938.28 కోట్లుగా ఉన్న ఆదాయం 2020-21లో రూ.1,183.58 కోట్లకు పెరిగింది. 2018-19లో ఆ ఆదాయం రూ.632.27 కోట్లు. ఇక్కడ షాపుల మద్యం అమ్మకాలపై వ్యాట్ 10 శాతం ఉండగా, బార్లు, రెస్టారెంట్లలో 18 శాతం ఉన్నది.

అయితే సగటు వినియోగం కేరళలో ఎక్కువ. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ జనాభా ఎక్కువగా ఉండగా, కేరళలో కేవలం 3.3 కోట్ల మంది మాత్రమే నివసిస్తున్నారు. జనాభా తక్కువగా ఉన్నా, సగటు వినియోగం ఎక్కువగా ఉండడం, అత్యధిక పన్ను రేటు వలన, కేరళలో ప్రభుత్వ ఆదాయం ఎక్కువే. కమ్యునిస్ట్ పాలన ఉన్నప్పుడు లేనప్పుడు మద్యం విషయంలో పరిస్థితిలో మార్పు లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, మద్యపానంలో ఇతర భారతీయ రాష్ట్రాలన్నింటిలో కేరళ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 18.7 శాతం మంది పురుషులు, నగరాల్లో 21 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. పురుషుల్లో 15 ఏళ్లు పైబడిన మద్యం సేవించే వారి జాతీయ సగటు 18.8 శాతం ఉంటే, కేరళలో ఇది 19.9 శాతంగా ఉంది. రాష్ట్రంలోని ఇతర 13 జిల్లాలతో పోలిస్తే అలప్పుజ జిల్లాలో మద్యం వినియోగం కాస్త ఎక్కువగా ఉంది.

మద్యం అమ్మకాల ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న తమిళనాడుతో తెలంగాణ తలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వానికి రూ.38 వేల కోట్లు, తెలంగాణకు రూ.40 వేల కోట్ల ఆదాయం సమకూరింది. గత రెండేళ్లలో మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణకు రూ.54,000 కోట్ల ఆదాయం వచ్చిందని. కాగా, కేవలం ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.40,000 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నది.



ఒక నాలుగేళ్ల కాలంలో కొత్తగా 2,076 కొత్త మద్యం దుకాణాలు వచ్చినందుకు ఉత్తరప్రదేశ్ మద్యం ఆదాయం 74 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో యోగి ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు, మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ సుంకం ద్వారా రూ.30,061 కోట్ల ఆదాయం సమకూరింది.

చివరి మాట

మద్యపానం, మద్యానికి ప్రజానీకం బానిసలుగా మారితే, దేశీయ ఉత్పత్తి మీద దుష్ప్రభావం ఉంటుంది. విదేశీ మద్యం ఉత్పత్తికి వేల కోట్ల నీరు వినియోగం అవుతుంది. నీటికి కటకట ఉన్న ప్రాంతంలో ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల స్థానికంగా ఆహారం ఉత్పత్తికి, త్రాగు నీటి అవసరాలకు నీరు దొరకని పరిస్తితులు ఏర్పడుతున్నవి. ఈ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధ జలాల వల్ల స్థానిక నీటి వనరులు కాలుష్యం అవుతున్నాయి. ఇంకా అనేక రూపాలలో ఈ పరిశ్రమ వల్ల కాలుష్యం పెరుగుతున్నది. ఈ పరిశ్రమ వల్ల, మద్యం వినియోగం వల్ల పర్యావరణం మీద, సమాజం మీద, అభివృద్ధి మీద, పాలన మీద పడే దుష్ప్రభావాల మీద అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఆర్థిక విశేశజ్ఞులు భారత దేశంలో మద్యం వినియోగం పెరగడం శుభాసూచికంగా భావిస్తూ, పట్టనికరణ వల్ల, అధిక ఆదాయం వల్ల ఇది సాధ్యం అవుతున్నదని విశ్లేషిస్తున్నారు.ఇటువంటి నివేదికలు చదివి ఎన్నికైన ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ విధానాలు రూపొందిస్తున్నారు. మద్యం వల్ల చితికిపోయిన కుటుంబాల మీద అధ్యయనాలు లేవు. మద్యం వల్ల హింసకు గురి అయిన మహిళల మీద సర్వేలు లేవు. మద్యం వల్ల అనారోగ్యంతో చనిపోయిన వారి గణాంకాలు లేవు. అధికారంలో ఉండడానికి ఎటువంటి విధానం అయినా తీసుకురావడానికి వెనుకాడని నాయకులు ఉన్న ఈ కాలంలో, ప్రభుత్వాన్నే అమ్మకానికి పెట్టి, ప్రైవెటికరణ చేస్తున్న ‘ముందు చూపు’ గల నాయకుల కనుసన్నలలో మద్యం ప్రభుత్వాలకు ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ప్రజలకు ఈ పరిస్థితి ఒక శాపంగా పరిణమించింది.


Tags:    

Similar News