YSRCP : జగన్ కు ఝలక్ లు ఇస్తున్న ఎమ్మెల్సీలు.. రాజీనామాలకు రెడీ అవుతున్న మరికొందరు... వెయిటింగ్ లిస్ట్ లో
వైసీపీకి వరస షాకులు తగులుతున్నాయి. జగన్ కు ఎమ్మెల్సీలు ఝలక్ లు ఇస్తున్నారు;

వైసీపీకి వరస షాకులు తగులుతున్నాయి. జగన్ కు ఎమ్మెల్సీలు ఝలక్ లు ఇస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత వరసగా రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక కోణాల్లో ఇచ్చిన పదవులను కూడా వివిధ కారణాలతో తమకు వద్దని చెబుతూ జగన్ ను వదిలి వెళ్లిపోతున్నారు. రాజ్యసభ సభ్యులు నలుగురు రాజీనామా చేయగా, ఇప్పటి వరకూ ఎమ్మెల్సీలు ఐదుగురు రాజీనామా చేశారు. మరికొందరు క్యూ లో ఉన్నారని చెబుతున్నారు.
వైసీపీకి బలం ఉండటంతో...
శాసనమండలిలో వైసీపీకి బలం ఉండటంతో బిల్లుల ఆమోదానికి ఇప్పటి వరకూ ఇబ్బంది కలగకపోయినా వరసగా ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తుండటం ఆ పార్టీ అధినాయకత్వాన్ని కలవర పరుస్తుంది. తాజాగా వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామాలేఖలను శాసనమండలి ఛైర్మన్ కు పంపారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవిని వైఎస్ జగన్ ఇచ్చారు.
వరసగా రాజీనామాలతో...
అయితే 2019, 2024 ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ ను ఆశించిన మర్రి రాజశేఖర్ కు చిలకలూరి పేట అసెంబ్లీ టిక్కెట్ జగన్ ఇవ్వలేదు. దీంతో చాలా కాలం నుంచి ఆయన అసంతృప్త నేతగానే ఉన్నారు. చివరకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీత, జయమంగళ వెంకట రమణ, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి రాజీనామాలు శాసనమండలి ఛైర్మన్ వద్ద ఉన్నాయి. ఐదో ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయడంతో వైసీపీకి గట్టి దెబ్బే తగిలింది. ఇప్పటికే కొత్తగా ఐదుగురు ఎమ్మెల్సీలు అధికార కూటమి నుంచి నెగ్గారు. ఈఐదుగురు ఎమ్మెల్సీల రాజీనామాలను ఛైర్మన్ ఆమోదిస్తే మొత్తం పదినెలల కాలంలో పది మంది ఎమ్మెల్సీలు కూటమి పరయినట్లు అనుకోవాలి. మొత్తానికి మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అందుతున్న సమాచారంతో జగన్ వర్గంలో కలవరం మొదలయింది.