Nallari : నల్లారి ఆశలు నెరవేరవట.. పదవి రాకపోవడానికి అదే కారణమటగా
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకుని బీజేపీలో చేరారు;

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకుని బీజేపీలో చేరారు. కూటమి ఏర్పాటుతో తాను లోక్ సభకు ఎన్నిక కావడం ఖాయమనుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చివరకు రాజంపేట పార్లమెంటు టిక్కెట్ ను అయితే సాధించుకున్నారు. కానీ విజయం లభించలేదు. దీంతో నల్లారి రాజ్యసభలో అయినా చోటు సంపాదించాలని పెద్దయెత్తున లాబీయింగ్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో తన పేరు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన పాత కాంగ్రెస్ మిత్రుడొకరు బీజేపీలో ఉండటంతో ఆయనతో అమిత్ షా వద్ద ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది.
ఏ పార్టీకి అనేది...
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం అనేది ఇంకా ఎవరికి ఇవ్వాలని కూటమి మాత్రం నిర్ణయించలేదు. ఎందుకంటే ఇటీవల ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి బీజేపీకి కేటాయించారు. దీంతో ఒక రాజ్యసభ స్థానం తమకు కావాలని టీడీపీ అడిగే ఛాన్సు ఉంది. అయితే బీజేపీ కూడా రాజ్యసభలో తమ బలం సొంతంగా పెంచుకునే ప్రయత్నంలో ఈ స్థానాన్ని గట్టిగా కోరే అవకాశాలున్నాయి. జనసేనకు ఇంతవరకూ రాజ్యసభలో అవకాశం కల్పించకపోవడంతో దానికి ఇచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు. ఇలా మూడు పార్టీలకు ఒక స్థానంలో ఎవరికి దక్కుతుందన్నది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుందన్నది వాస్తవం.
ఈ ఇద్దరి పేర్లు...
కానీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆశలు పెద్దగానే పెట్టుకున్నారు. బీజేపీకి కేటాయించినా ఆయన పేరు పరిశీలిస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే బీజేపీని నమ్ముకుని సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న అనేక మంది నేతలు పదవుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే ఆ స్థానంపై కర్ఛీఫ్ వేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరో కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమయిన విష్ణువర్థన్ రెడ్డి తనకు ఈసారి పార్టీ నాయకత్వం అవకాశం ఇస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అందులో వీరిద్దరూ బీజేపీకి నమ్మకమైన వారు కావడంతో అధిష్టానం కూడా వీరి వైపు మొగ్గే అవకాశముంటుందని తెలుస్తోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు నుంచి కూడా పెద్దగా అభ్యంతర పెట్టకపోవచ్చని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో నల్లారి, నారా కుటుం
ఇవే మైనస్ లు...
దీంతో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ లోనే సుదీర్ఘకాలం సాగడంతో పాటు ఇప్పటికీ కాంగ్రెస్ ఢిల్లీ నేతలతో సంబంధ బాంధవ్యాలను నెరుపుతున్నారన్న పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఖరారు చేసే అవకాశం లేదంటున్నారు. అందులోనూ గత ఎన్నికల్లో టిక్కెట్ పొంది ఓటమి పాలు కావడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలన స్థాయిలో కూడా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా కొంత కాలం వెయిట్ చేయడమే తప్ప చేయగలిగిందేమీ లేదన్నది వాస్తవం. అందులోనూ మాజీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ లో పనిచేయడంతో పాటు ఆయనపై తెలంగాణలో ఇప్పటికీ వ్యతిరేకత ఉండటం కూడా నల్లారికి మైనస్ అని చెబుతున్నారు.