Chandrababu : గుర్తుండదులే అనుకున్నారా? మర్చి పోయారని భావించారా? మీరు ట్రాన్స్‌ఫర్ చేయలేదా?
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ అధినేత జగన్త్ మంత్రులను నియోజకవర్గాలను మార్చడంపై చేసిన కామెంట్స్ ఆయనకే ఎదురుతగులుతున్నాయి
"నా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఇలా మంత్రులను ట్రాన్స్‌ఫర్ చేయడం చూడలేదు. మంత్రులకు కూడా ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది" అని నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ ను ఎద్దేవా చేశారు. కానీ ఆయనకు మరిచిపోయి ఉంటారో... తెలియదని భావించాలో మనం అనుకోలేం. జనానికి మతి మరుపు ఎక్కవనైనా ఆయన అనుకోని ఉండవచ్చు. ఐదేళ్ల క్రితం జరిగింది ఇప్పుడు ఎవరికి గుర్తుండి ఉంటుందిలే అని ఈ కామెంట్స్ చేసి ఉండవచ్చు. కానీ గతంలో ఒకసారి చూస్తూ చంద్రబాబు కూడా ఇలాగే చేశారన్నది మాత్రం వాస్తవం. అది చరిత్ర. ఎవరూ మరిచిపోరు కూడా.
ఎవరి వ్యూహాలు వారివే కదా?
ఎన్నికల సమయంలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎవరి ఎత్తుగడలు వారివి. మంత్రులనే కాదు.. వారు ఎమ్మెల్యేలు కూడా... వారిపై ఉన్న వ్యతిరేకత నుంచి పార్టీని తప్పించడానికి వారిని వేరే ప్రాంతానికి పంపడం ఇప్పుడు కొత్తేమీ కాదు. జగన్ ఒక్కరే కొత్తగా చేయలేదు. నియోజకవర్గంలో ప్రధానంగా ఎస్.సి నియోజకవర్గాల్లో నాడు చంద్రబాబు హయాంలో కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం, నేడు జగన్ హయాంలో రెడ్ల ఆధిపత్యంలో నేతల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఇది ఏ పార్టీ ఉన్నా మామూలు విషయమే. అందుకే అక్కడ నేతల నుంచి అధినేతలపైకి వత్తిడి వస్తుంటుంది.
గత ఎన్నికలలో...
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా చేసిందిదే. కొవ్వూరు నుంచి నాటి మంత్రి కె.జవహర్ ను తప్పించి ఆయనను తిరువూరుకు పంపారు. అక్కడ టీడీపీ నేతలకు, జవహర్ కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో 2019 ఎన్నికల్లో జవహర్ ను తిరువూరుకు చంద్రబాబు ట్రాన్స్‌ఫర్ చేసిన విషయం బహుశా ఆయన మర్చిపోయి ఉండవచ్చు. కానీ.. నాడు ఎన్నికలు చూసిన వారికి ఎవరికైనా తెలిసే ఉంటుంది. అదే సమయంలో పాయకరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి దెబ్బకు అక్కడి ఎమ్మెల్యే వంగలపూడి అనితను కొవ్వూరుకు మార్చింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు కాదా? అన్న ప్రశ్న తలెత్తుంది.
మార్చింది మీరే కదా?
అవన్నీ మర్చిపోయి ఈరోజు వైసీపీ అధినేత జగన్ మంత్రులను ట్రాన్స్‌ఫర్ చేయడం తన రాజకీయజీవితంలో ఎన్నడూ చూడలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఏ పార్టీ నేతకైనా గెలుపు అవసరం. వాళ్లు మంత్రులా? ఎమ్మెల్యేలా? అని చూడరు. మంత్రులకయితే కొమ్ములుండవు. వాళ్లు మళ్లీ గెలుస్తారని నమ్మకం కూడా లేదు. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి తిరువూరుకు ట్రాన్స్‌ఫర్ చేసిన జవహర్ ను అక్కడి ప్రజలు ఆదరించలేదు. అలాగే కొవ్వూరులో పాయకరావుపేట నుంచి వచ్చిన వంగలపూడి అనితనూ అక్కడి ప్రజలు ఆదరించలేదు. ట్రాన్స్‌ఫర్ చేసినంత మాత్రాన గెలుస్తారన్న గ్యారంటీ లేదు. అది ఒక ప్రయోగం మాత్రమేనన్నది ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ గుర్తుంచుకుంటే మంచిదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.