హైద‌రాబాద్ క్రికెట‌ర్ తిలక్ వర్మపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ ప్ర‌శంస‌లు

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో తిలక్ వర్మ ఇప్పటివరకు తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Update: 2023-08-10 09:50 GMT

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో తిలక్ వర్మ ఇప్పటివరకు తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ రాణిస్తాడని అంచనా. ఈ నేప‌థ్యంలో భారత జట్టు మాజీ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్.. తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించారు.

ప్రసాద్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తిలక్ వర్మ లిస్ట్ ఎ రికార్డ్‌ను చూడండి. అత‌ను 25 లిస్ట్ A మ్యాచ్‌లు ఆడాడు. ఐదు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువ.. 56.18 సగటుతో 1,236 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కకపోతే ప్రపంచకప్‌లో తిలక్ వర్మకు అవకాశం ఇవ్వడంలో తప్పేమీ లేదని ఎంఎస్‌కే ప్రసాద్ అన్నారు. అప్పుడే తిలక్ వర్మ గురించి ఆలోచిస్తారు. తిలక్ త్వరలోనే భారత పరిమిత ఓవర్ల జట్టులో రెగ్యులర్ ప్లేయ‌ర్‌గా ఉంటాడని ఆశిస్తున్నానని అన్నాడు.

తిలక్ వర్మ తన బ్యాటింగ్ టెక్నిక్‌తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. రాబోయే ఆసియా కప్, 50 ఓవర్ల ప్రపంచకప్ కోసం శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తమ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తిలక్ వర్మను టీమ్‌లో చేర్చుకోవాలని అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో తిలక్ వర్మ అజేయంగా 49 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తిల‌క్‌ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి కీలకమైన 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది.


Tags:    

Similar News