KTR : బడ్జెట్ తో సంక్షేమానికి సమాధి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు;

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు సొల్లు పురాణం చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాత వాటిని అమలు పర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ గా ఆయన అభివర్ణించారు. గత బడ్జెట్ అంచనాలకు కూడా చేరుకోలేకపోయిందని అన్న కేటీఆర్ ఇది మాయ లెక్కలు చెబుతూ మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఓట్లేసిన పాపానికి కోట్లాది మందిని ముంచే బడ్జెట్ ఇది అని కేటీఆర్ అన్నారు.
అసమర్థ పాలనతో...
అసమర్థ పాలనతో ఆదాయం పూర్తిగా దిగజారిపోయిందని కేటీఆర్ అన్నారు. చేతకానితనం కారణంగానే ఆదాయం తగ్గి తెలంగాణ అప్పులు పెరిగిపోయాయని కేటీఆర్ అన్నారు. ఒక్క ఏడాదిలోనే లక్షా అరవై వేల కోట్ల అప్పులు చేసిన ఈ ప్రభుత్వం కనీసం ప్రభుత్వ సిబ్బందికి సకాలంలో జీతాలు కూడా చెల్లించలేమని చెప్పే పరిస్థితికి దిగజారిందన్నారు. ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయకుండా ప్రజలను పక్క దోవపట్టించేలా ఈ బడ్జెట్ లెక్కలున్నాయని కేటీఆర్ అన్నారు. సంక్షేమానికి ఈ బడ్జెట్ తో సమాధి కట్టినట్లయిందని కేటీఆర్ అన్నారు.