Telangana Budget : వ్యవసాయరంగంపైనే రేవంత్ సర్కార్ ఫోకస్.. భారీగానే నిధులు
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్ లో అధిక మొత్తంలో నిధులు కేటాయించింది.;

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్ లో అధిక మొత్తంలో నిధులు కేటాయించింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులను పుష్కలంగానే కేటాయింపులు జరిపింది. వ్యవసాయ రంగానికి 24,439 కోట్లను కేటాయించింది. అదే సమయంలో రైతు భరోసా కు కూడా పద్దెనిమిద వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఆదుకునేందుకు అన్ని రకాలుగా వారికి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకునేలా బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు కనపడుతుంది. తెలంగాణలో 2025 - 2026 ఆర్థిక సంవత్సరానికి మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
రైతు భరోసా నిధులు...
తెలంగాణలో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు అందించడంతో పాటు, వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ఈనిధులు వెచ్చించనున్నారు. రైతు భరోసా కింద పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో ఈ ఏడాది అందరికీ రైతు భరోసా నిధులు అందిస్తామన్న సంకేతాలను అన్నదాతల్లో కల్పించారు. ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభించిన ప్రభుత్వం, రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకోసం పద్దెనిమిదివేల కోట్ల రూపాయలను కేటాయించడాన్ని పాజిటివ్ కోణంలోనే చూడాలంటున్నారు.
సాగునీటి ప్రాజెక్టులు, విద్యత్తు రంగానికి...
ఇక వ్యవసాయ రంగానికి అవసరమైన నీరు, విద్యుత్తును అందించడంలో కూడా తమ ప్రభుత్వం ముందుంటుందని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందుకే సాగునీటి రంగానికి 23,373 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు. అదే సమయంలో నిరంతరం నాణ్యతతో కూడిన విద్యుత్తును అందించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయం మేరకు విద్యుత్తు శాఖకు 21,221 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పట్ల తమ చిత్త శుద్ధి ఏంటో అర్థమవుతుందని తెలిపారు. అన్నదాతలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుందని తెలిపారు. సన్నరకం వడ్లను కూడా కొనుగోలు చేస్తుందని, ఈ ఏడాది కూడా బోనస్ ఇస్తున్నట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.