Telangana Budget : మిగిలిపోయిన హామీల నిధుల ప్రస్తావన లేదే.. కేటాయించారా? లేదా?
తెలంగాణ బడ్జెట్ ను 3,04, 965 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టారు.;

తెలంగాణ బడ్జెట్ ను 3,04, 965 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టారు. అయితే ప్రధాన మైన హామీల కోసం ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురయింది. ప్రధానంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో కేటాయింపులు జరగలేదన్న విమర్శలు అప్పుడే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మహిళలకు ఇస్తామన్న దానికి కూడా నిధులు కేటాయింపులు జరపలేదు. మహిళలకు ఈ ఏడాది అయినా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలను ఇస్తారని ఊహించారు. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి.
పింఛను మొత్తాన్ని...
ఇక గత ఎన్నికల్లో పింఛను మొత్తాన్ని పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఇంత వరకూ అమలు చేయలేకపోయింది. ప్రస్తుతం ఇస్తున్న పింఛను మొత్తాన్ని కనీసం మూడు వేల రూపాయలకు పెంచుతామని భావించారు. కానీ ఆ విషయంలో బడ్జెట్ లో ఎలాంటి స్పష్టత రాలేదు. పింఛను మొత్తాన్ని ఈ ఏడాదైనా పెంచుతారని భావించిన వృద్ధులకు నిరాశ మిగిల్చింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛను మొత్తం పెంపుదలపై ఎంతో ఆశలు పెట్టుకున్నా ఈ బడ్జెట్ వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పింఛను మొత్తాన్ని పెంచుతామన్న ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఈ ఏడాది కూడా పింఛను పెంపుదల లేనట్లే అనుకోవాలి.
కల్యాణ లక్ష్మి పథకానికి...
ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించినా ఇంతవరకూ సాధ్యం కాలేదు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన కేటాయింపులు కూడా జరగలేదు. కల్యాణ లక్ష్మిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్ లో స్పష్టత లేదు. అలాగే చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. వీటిలో కొన్నింటికైనా నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ వీటి ప్రస్తావన లేదు. అయితే బడ్జెట్ లో ఆరు గ్యారంటీల అమలు కోసం 56,084 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. మరి ఈ నిధులు వేటికన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం అమలయిన హామీలకు ఈ నిధులు కేటాయించారా? లేదా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.