నేడు టి. కాంగ్రెస్ చింతన్ శిబిర్

Update: 2022-06-01 02:12 GMT

తెలంగాణ కాంగ్రెెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి మరిన్ని చర్యలు చేపట్టింది. నేడు కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ ను ఏర్పాటు చేసుకుంది. వైఫల్యాలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి ఈ చింతన్ శిబిర్ ను ఏర్పాటు చేసింది. నగర శివార్లలో ఏర్పాటు చేసిన ఈ చింతన్ శిబిర్ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలు హాజరవుతున్నారు. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు.

వరస ఓటములతో....
రేపు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ శిబిరానికి హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత రెండు ఎన్నికల్లో వరసగా ఓటములును చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ చింతన్ శిబిర్ కు దూరంగా ఉంటున్నారు. ఆయన అమెరికా పర్యటనలో ఉండటంతో ఆయన లేకుండానే చింతన్ శిబిర్ జరుగుతుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
క్యాడర్ ను స్నన్నద్ధం...
పార్టీలో సంస్థాగతంగా మార్పులు, ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ వేదికగా నిర్వహించిన చింతన్‌శిబిర్‌ తరహాలో రాష్ట్రంలోనూ మేధోమథన సదస్సు జరగనుంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇవాళ, రేపు రెండు రోజుల పాటు హైదరాబాద్‌ శివారు కీసరలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉద‌య్‌పూర్ డిక్లరేష‌న్‌పైనే ఇందులో ప్రధాన చర్చ జరగనుంది.
ఆరు అంశాలపై....
ఉదయ పూర్ డిక్లరేషన్ తో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా యువతకు పదవుల కేటాయింపు, సామాజిక న్యాయం వంటి విషయాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. గత కొన్నేళ్ల నుంచి దూరమైన ఓటు బ్యాంకును తిరిగి దరిచేర్చుకునేందుకు ఏమేం చేయాలన్న దానిపై నేతల నుంచి ఈ శిబిరంలో సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. మొత్తం ఆరు ఆంశాలపై చర్చ జరగనుంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, యువత, ఆర్థికం, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చించనున్నారు. మొత్తం రెండు రోజులపాటు ఈ చింతన్ శిబిర్ జరగనుంది. ఈ శిబిరానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులను వివరించేందుకు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ ఛార్జులు పాల్గొన్నారు.


Tags:    

Similar News