ఏప్రిల్ 3 నుండి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు
10 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. వివిధ సబ్జెక్టుల్లో వీక్ గా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9,10 తరగతుల పరీక్షల విధానంలో కొత్త మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుండి 9,10 తరగతుల విద్యార్థులకు 6 పేపర్లతోనే పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఏడాది ఏప్రిల్ 3 నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల ప్రశ్నాపత్రాలు, సిలబస్ పై అధికారులతో చర్చించారు.
ఈ విద్యాసంవత్సరం నుండి ఒక్కో సబ్జెక్టులో పరీక్షలకు 80, ఫార్మెటివ్ అసెస్ మెంట్ కు 20 మార్కులు ఉంటాయని తెలిపారు. సైన్స్ పేపర్లో ఫిజిక్స్, బయోలజీకి చెరి సగం మార్కులుంటాయని వెల్లడించారు. అలాగే అన్ని సబ్జెక్టులకు పరీక్ష సమయం 3 గంటలు ఉండగా.. సైన్స్ పరీక్షకు మాత్రం 3.20 నిమిషాల సమయం ఉంటుందని మంత్రి వివరించారు. 10 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. వివిధ సబ్జెక్టుల్లో వీక్ గా ఉన్న విద్యార్థులను గుర్తించి.. వారికి సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా బోధించాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకంటే మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.