తెలంగాణలో గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
శ్రీరామనవమి రోజు సాయంత్రం ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకుంది. రాత్రి పడుకున్నాక శ్వాస తీసుకోవడంలో..
ఇటీవల కాలంలో చాలామంది గుండెపోటు బారిన పడి మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇందుకు వయసుతో సంబంధం లేదు. పట్టుమని 15 సంవత్సరాలైనా దాటని పిల్లల నుంచి ఆరుపదులు దాటిన వృద్ధుల వరకూ.. ఈ సమస్య వేధిస్తోంది. తింటున్న ఆహార లోపమో, వేసుకుంటున్న మందుల ప్రభావమో తెలియదు కానీ.. గుండెపోటుతో హఠాన్మరణం చెంది.. కన్నవారికి కడుపుశోకాన్ని మిగులుస్తున్నారి. తాజాగా తెలంగాణలో 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో నివాసముండే దంపతులు వృత్తిరీత్యా వ్యవసాయదారులు. వ్యవసాయమే వారికి జీవన ఆధారం. వారికి ఇద్దరు బిడ్డలు. చిన్నకూతురు స్రవంతి (13) మరిపెడలోని ప్రైవేటు స్కూల్లో 6వ తరగతి చదువుతోంది. శ్రీరామనవమి రోజు సాయంత్రం ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకుంది. రాత్రి పడుకున్నాక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో.. స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించి తీసుకొచ్చారు. ఇంటికొచ్చాక తాతయ్య ఒడిలో కుప్పకూలిపోయింది. చిన్నారి హఠాన్మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.