Revanth Reddy : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు;
తెలంగాణలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తొలి ఏడాదిలోనే యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని నియామకాలు ఈ ఏడాదిలో చేపట్టామని తెలిపారు. గత పదేళ్లలో ఒక్క కుటుంబమే నాలుగు ఉద్యోగాలను సంపాదించుకుందని, నిరుద్యోగులను పక్కనపెట్టిందని రేవంత్ అన్నారు. అలాంటిది గత ఎన్నికల్లో ప్రజలు ఆ నలుగురి ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాను నిరుద్యోగ సమస్యలను తెలుసు కాబట్టి వరసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈరోజు తాను కానీ, తన మంత్రివర్గ సభ్యులు కానీ ఎవరూ తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పించుకోలేదన్నారు.
పరీక్షలను వాయిదా వేయం...
పరీక్షలు వాయిదా వేయడం వల్ల అనేక మంది నష్టపోతారని తెలిసి ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు. పోటీ పరీక్షలు నిర్వహించి సత్వరం అపాయింట్ మెంట్ లెటర్లు ఇస్తున్నామని చెప్పారు. న్యాయస్థానాలలో కేసులు వేసినా అవి నిలబడలేదన్నారు. గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తుంటే వద్దంటూ కొందరు కావాలని కృత్రిమ ఉద్యమాలను చేశారన్నారు. పదకొండేళ్లలో గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయలేదన్న కారణంతో వాటిని నిర్వహించామని చెప్పారు. టీజీపీఎస్సీ అధికారులు కృషి చేసి గ్రూప్ వన్ ఉద్యోగులకు త్వరలోనే నియామకాలు చేపడతారని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రాజకీయ కేంద్రంగా మార్చలేదని, ఐఏఎస్ అధికారిని నియమించామని తెలిపారు.
విద్య, వైద్య రంగాలను...
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసిందన్నారు. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సిలర్లు లేరని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సిలర్లను నియమించామన్నారు. విద్య, వైద్య శాఖను అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని పది లక్షల రూపాయల వరకూ విస్తరించామని తెలిపారు. 835 కోట్ల రూపాయలు తొలి ఏడాది సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆరోగ్యానికి ఖర్చు చేశామని తెలిపారు. యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందుకుంటున్నాయని తెలిపారు. యాభై లక్షల కుటుంబాలు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందుతున్నారని చెప్పారు.