900 ఏళ్ల నాటి శాసనాన్ని కాపాడుకోవాలి!!
మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనున్న గంగాపురం శివారులోని చౌడమ్మ ఆలయ చెరువు కట్టపై 900 ఏళ్ల నాటి కన్నడ శాసనం ఆలనా పాలన లేక నిరాదరణకు గురైందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా.ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు
మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనున్న గంగాపురం శివారులోని చౌడమ్మ ఆలయ చెరువు కట్టపై 900 ఏళ్ల నాటి కన్నడ శాసనం ఆలనా పాలన లేక నిరాదరణకు గురైందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా.ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వారసత్వ సంపదను పరిరక్షించి, భవిష్యత్ తరాలకు అందించటం పై అవగాహన కార్యక్రమంలో భాగంగా, సోమవారం నాడు, ఆయన గంగాపురం చౌడమ్మ ఆలయ సమీపంలోని గల క్రీ.శ. 1134వ సంవత్సరం, జూన్ 8వ తేదీ శుక్రవారం నాడు, కళ్యాణ చాళుక్య చక్రవర్తి 'భూలోకమల్ల' మూడో సోమేశ్వరుడు, కళ్యాణనగరం నుంచి పాలిస్తుండగా, అతని కుమారుడైన మూడో తైలాపుని సుంకాధికారులు, స్థానిక సోమనాథ దేవుని గంధ, ధూప, అఖండ దీపాల కోసం 'వడ్డరావుళ, హెజ్జంక' అనే పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని కానుక ఇచ్చిన వివరాలు ఆ శాసనంలో ఉన్నాయని శివనాగిరెడ్డి తెలిపారు.
గతంలో పురావస్తు శాఖ ప్రచురించిన చారిత్రక ప్రాధాన్యత గల ఈ శాసనాన్ని భద్రపరిచి కాపాడుకోవాలని చౌడమ్మ ఆలయ ధర్మకర్తలు కటికల మల్లికార్జున్, గిరి ప్రసాద్, చెన్నయ్య శ్రీను, శంకర్ శ్రీనివాస్, సత్తయ్యలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగాపురం కేశవప్రసాద్, మరికొందరు గంగాపురం గ్రామస్తులు పాల్గొని ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.