వద్దని వారించినా వినలేదు.. వాగులో వ్యక్తి గల్లంతు

పెంటప్ప మాత్రం గ్రామంలోకి వెళ్లేందుకు వాగు దాటుతుండగా.. అటువైపు ఇటువైపు ఉన్న గ్రామస్తులు వద్దని పెంటప్పను..

Update: 2023-07-22 07:38 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి కురిసిన వర్షాలకు కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే పోలీస్ శాఖ,రెస్క్యూ జిహెచ్ఎంసి అధికారులు ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయినా కూడా వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి వాగులో గల్లంతు కావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన తాండూరు మండలంలోని సంగెంకలాన్ లో చోటు చేసుకుంది. సంగెంకలాన్ గ్రామానికి చెందిన బొక్తంపల్లి పెంటప్ప(48) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం షాపూర్ లో బంధువుల అంత్యక్రియల కోసం సుమారు 30 మంది వ్యక్తులతో కలిసి వెళ్ళాడు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం సమయంలో గ్రామానికి తిరిగి పయనమయ్యాడు. గ్రామానికి సమీపంలోకి రాగానే భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో 30 మందితో కలిసి ఉన్న పెంటప్ప అక్కడే ఉన్న ఓ కల్లు దుకాణం వద్దకు వెళ్లి కూర్చున్నారు.

పెంటప్ప మాత్రం గ్రామంలోకి వెళ్లేందుకు వాగు దాటుతుండగా.. అటువైపు ఇటువైపు ఉన్న గ్రామస్తులు వద్దని పెంటప్పను వారించారు. వారి మాట వినకుండా పెంటప్ప వాగులోకి దిగగా.. కొంత దూరం నడిచాక వాగు ఉధృత ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. గ్రామస్తులు పెంటప్ప కొట్టుకుపోయిన వాగు కుండ అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెంటప్పకు భార్య అమృతమ్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. వీరందరూ పెంటప్ప మిస్సైన స్థలానికి చేరుకుని ఆందోళన చెందుతున్నారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది నిన్న రాత్రి వరకు వెతికేందుకు ప్రయత్నించారు కానీ అతని జాడ కనిపించలేదు. శనివారం ఉదయం కరణ్ కోట్ ఎస్ ఐ మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని ఆరా తీశారు. స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వాగు ఉధృతి కొద్దిగా తగ్గడంతో పెంటప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News