హైదరాబాద్‌లో వర్షానికి ఏపీ నుంచి ఎదురుగాలి.. కేటీఆర్ ఎఫెక్ట్ మరి!!
పక్క రాష్ట్రంలో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ వర్షాలతో కౌంటర్లు పడుతున్నాయి.
హైదరాబాద్‌లో నిన్న కురిసిన కుండపోత వర్షంతో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారినా లోతట్టు ప్రాంతాలు మాత్రం ఎప్పటిలానే జలమయమయ్యాయి. ఒక్క వర్షానికే నగరంలోని పలుప్రాంతాలు నీటమునిగాయి. రబ్బరు బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి ఎదురుగాలి వీస్తోంది.
ఒక్కరోజు వర్షానికే నీటమునిగితే ఎలా అంటూ వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి. పక్క రాష్ట్రంలో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్లు పడుతున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తనకో స్నేహితుడు ఉన్నాడని.. ఆయన సంక్రాంతికి వాళ్ల ఊరు వెళ్తే రోడ్లు సరిగ్గా లేవు.. కరెంటు సరిగ్గా లేదు.. నీళ్లు లేవు.. తెలంగాణ ప్రజలను బస్సులెక్కించి ఇక్కడికి పంపిస్తే అక్కడ ఎంత బాగుందో తెలుస్తుందని చెప్పారని వ్యాఖ్యానించారు.
ఏపీ అని పేరెత్తకపోయినా సంక్రాంతి అనే సరికి అందరూ ఏపీ అనే నిర్ధారించుకున్నారు. ఏపీలో కంటే తెలంగాణలో మౌలిక వసతులు బాగున్నాయంటూ కుండబద్దలు కొట్టినట్టే చెప్పారు. అయితే ఏపీలోని అధికార పార్టీ వైసీపీ నేతలు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉక్కపోతలతో జనరేటర్ వాడుకున్నానని మంత్రి బొత్స అంటే.. ఏపీ నుంచి వాడుకున్న కరెంటు బిల్లులు చెల్లించాలని మరొకరు డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దారుణమని దుమ్మెత్తిపోశారు.
వ్యవహారం ముదరడంతో పొరుగు రాష్ట్రంతో ఉన్న గొడవలు చాలు.. కొత్త కయ్యమెందుకు అనుకున్నారేమో టంగ్ స్లిప్ అయిందంటూ కేటీఆర్ కాంప్రమైజ్ అయ్యారు. పొరపాటైందని చెప్పకనే చెప్పారు. అంతవరకూ బాగానే ఉన్నా.. ఏపీలో అధికార వైసీపీకి మాత్రం జరగాల్సి డ్యామేజీ జరిగిపోయింది. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ప్రతిపక్ష టీడీపీ బలంగానే ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వైసీపీకి ఇబ్బందిగా మారింది. అందుకు కారణమైన కేటీఆర్‌పై కాస్త ఘాటుగానే ట్రోల్ చేస్తోంది.
అలాంటి సమయంలో సరిగ్గా హైదరాబాద్ వర్షాలు కలిసొచ్చాయి. ఒక్క రోజు వర్షానికే నగరంలోని ప్రాంతాలు నీటమునగడంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ సీఎం జగన్ అభిమానులు. రబ్బరు బోట్లలో జనాన్ని తరలిస్తున్న వీడియోలు షేర్ చేస్తూ కేటీఆర్ ఫ్రెండ్ హైదరాబాద్ మినీ స్విమ్మింగ్‌పూల్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇది చినికిచినికి ఎంతదూరం వెళ్తుందో చూడాలి మరి!!