అమీర్‌పేటలో వైన్ షాప్ టెండర్ సొంతం చేసుకున్న ఏపీ సర్పంచ్

తెలంగాణ రాష్ట్రంలోని మద్యం షాపులకు సోమవారం లక్కీ డ్రాలు నిర్వహించారు.

Update: 2023-08-22 03:12 GMT

తెలంగాణ రాష్ట్రంలోని మద్యం షాపులకు సోమవారం లక్కీ డ్రాలు నిర్వహించారు. కలెక్టర్లు, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో రాష్ట్రంలోని 2,620 వైన్‌ షాపులకు లక్కీ డ్రా తీశారు. ఏకంగా 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 40 శాతం మంది కొత్త వారికి షాపులు దక్కాయి. ఏపీలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుండటంతో తెలంగాణలోని పలు ప్రాంతాల షాపులకు ఏపీ వ్యాపారులు కూడా దరఖాస్తు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఏపీ కి చెందిన వారు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలోని కోనసీమ జిల్లా అల్లవరం మండలం మొగళ్లమూరు సర్పంచ్‌కు హైదరాబాద్‌లో వైన్‌ షాపు దక్కడం విశేషం. సర్పంచ్‌ రాయుడు విష్ణుత్రిమూర్తులు తన భార్య పేరిట రెండు టెండర్లు వేశారు. లక్కీ డ్రాలో అమీర్‌పేటలోని ఓ షాపు దక్కించుకున్నారు. ఇంకా పలువురు ఏపీకి చెందిన వ్యక్తులు వైన్ షాప్ టెండర్లు సొంతం చేసుకున్నారు.

ఇక నేటి నుంచి లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనాభా ఆధారంగా ఆరు శ్లాబుల లైసెన్సు ఫీజు(ఎక్సైజ్‌ ట్యాక్స్‌)ను ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. 5వేల జనాభాలోపు ఉన్న ప్రాంతాల్లోని వైన్‌ షాపునకు రూ.50 లక్షలు, 5వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లోని షాపులకు రూ.55 లక్షలు.. 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాల షాపులకు రూ.60 లక్షలు.. లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల షాపులకు రూ.65 లక్షలు.. 5 నుంచి 20 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల షాపులకు రూ.85 లక్షలు.. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని షాపులకు రూ.1.10 కోట్ల చొప్పున లైసెన్సు ఫీజులగా నిర్ణయించారు. షాపులు దక్కించుకున్న వారు ఈ వార్షిక ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు చెల్లించినవారికి ఎక్సైజ్‌ శాఖ ప్రొవిజనల్‌ లైసెన్సులను జారీ చేస్తుంది. నవంబరు 30 నుంచి షాపులకు మద్యం, బీరును సరఫరా చేస్తారు. డిసెంబరు 1 నుంచి కొత్త షాపులను తెరుచుకోవాలి.


Tags:    

Similar News