డిసెంబర్ లోపే ఎన్నికల.. ఈసీ నుంచి పరోక్ష సంకేతాలు
ఎన్నికల విషయమై ఇటీవలే ఎలక్షన్ కమిషన్ బృందం తెలంగాణలో మూడురోజులు పర్యటించి, ఉన్నత అధికారులతో..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అంతకన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సాధారణంగా డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈసారి అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు తెలిపింది.
ఎన్నికల విషయమై ఇటీవలే ఎలక్షన్ కమిషన్ బృందం తెలంగాణలో మూడురోజులు పర్యటించి, ఉన్నత అధికారులతో వరుస భేటీలు నిర్వహించింది. రాష్ట్రంలో పర్యటించిన బృందంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, ఆర్ కే గుప్తా, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ అవినాశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హిర్దేశ్ కుమార్, ఇతర డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, కలెక్టర్లు, ఐటీ, పోలీసు ఉన్నత అధికారులతో రెండురోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించింది. సమయం ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 7 లోపే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని ఈసీ పరోక్షంగా సంకేతాలిచ్చింది. అధికారులు కూడా అదే జరగవచ్చని చెబుతున్నారు.
ఈసీ కొత్తగా తీసుకు వచ్చిన సాంకేతికత, కొత్త అప్లికేషన్ల వాడకంపై అవగాహనతో పాటు.. ఓటర్ జాబితా, నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలు, పోలీస్ చెకింగ్ పాయింట్ల ఏర్పాటు, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులతో ఈసీ బృందం చర్చించింది. ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లుగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అధికారులను త్వరగా బదిలీ చేయాలని కూడా ఈసీ బృందం ఆదేశించినట్లు సమాచారం.