Telangana : అంకెలే అన్నీ సెట్ చేస్తాయి.. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరొకలా?

తెలంగాణలో బొగ్గు గనుల వేలం రాజకీయ విమర్శలకు దారితీసింది. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరొకలా కేంద్రం వ్యవహరిస్తుందంటున్నారు

Update: 2024-06-21 05:25 GMT

నిజం.. రాజకీయాల్లో అంకెలే ముఖ్యం. అంకెలే నిర్ణయాలను నిర్దేశిస్తాయి. అవి ప్రజోపయోగమో? లేదో? తెలిపేవి కూడా అంకెలే. పాలిటిక్స్ లో అంకెలకున్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన నిర్ణయాలకు కీలకంగా మారాయనడంలో సందేహం లేదు. అందుకే జనం తీర్పును బట్టే కొన్ని సంస్థల భవిష్యత్ ను ఆధారపడి ఉంటాయని కూడా చెప్పవచ్చు. ఇలా అనేక ఉదాహరణలున్నాయి. అనేక సార్లు దేశంలో ఇదే జరిగింది. అంకెలు కరెక్ట్ గా ఉంటే ఇక పాలకులు ఏమాత్రం ఆలోచన చేయరు. తాము అనుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు వెనుకాడరు. అదే సమయంలో తమ ఉనికికి ప్రమాదం అని తెలిసినప్పుడు ప్రకటించిన నిర్ణయాలు కూడా వెనక్కు తీసుకుంటారు.

ఏపీలోని టీడీపీ పైనే...
ిఇందుకు ఉదాహరణ రెండు తెలుగు రాష్ట్రాలేనని చెప్పాలి. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మిత్రపక్షాలపై ఆధారపడి ఉంది. ఇది ఏపీకి ఒకరకంగా లాభం చేకూర్చింది. అదే తెలంగాణలో మరో సంస్థకు నష్టం చేకూర్చేలా మారింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పాటయి పోటీ చేశాయి. మూడు పార్టీలకు కలిసి 25 పార్లమెంటు స్థానాలలో పోటీ చేయగా అందులో 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. అత్యధికంగా పదహారు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. రెండు స్థానాల్లో జనసేన, మూడు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలిచింది. కానీ కేంద్రంలో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చేటన్ని సీట్లు తెచ్చుకోలేకపోవడంతో టీడీపీ సాధించిన పదహారు స్థానాలే కీలకమయ్యాయి. టీడీపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలో మూడోసారి వచ్చిందన్నది కాదనలేని వాస్తవం.
విశాఖ స్టీల్ ప్లాంట్...
అయితే ఏపీలో అనేక సమస్యలున్నాయి. రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ఆ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యతలు. దీనికి సంబంధించిన నిధుల కోసం ఖచ్చితంగా టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దాదాపు ఈ ఐదేళ్లు ఆగినట్లే అనుకోవాలి. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తామని మోదీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇప్పుడున్న అంకెలు అందుకు సహకరించవు. టీడీపీ, జనసేన ప్రయివేటీకరణకు వ్యతిరేకం కావడంతో దానిని ప్రయివేటీకరించే ప్రయత్నం మాత్రం మానుకున్నట్లే. కార్మికులు వెయ్యి రోజులకు పైగా చేసిన ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోయినప్పటికీ, ఫలితాలతో మాత్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే అన్నిస్థానాలు టీడీపీకి రాకున్నా, లేక బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు పరం కాకుండా ఆపడం ఎవరి వల్ల అయ్యేది కాదు. ఇది అక్షర సత్యం.
తెలంగాణలో మాత్రం...
ఇదే సమయంలో ఇప్పుడు తెలంగాణలో బొగ్గు గనుల వేలం రచ్చకు దారి తీస్తుంది.కానీ ఇక్కడ ఎలాంటి లెక్కలు పనిచేయవు. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో బీజేపీకి ఎనిమిది, కాంగ్రెస్ కు ఎనిమిది పార్లమెంటు స్థానాలువచ్చాయి. బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. దీంతో ఇక్కడ బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. అందులోనూ తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి చేతిలోనే ఆ శాఖను పెట్టి మరీ బొగ్గు గనులను వేలం వేస్తున్నారు. బొగ్గు గనుల వేలం హైదరాబాద్ లో జరుగుతుందని కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. బొగ్గు గనుల వేలంలో ప్రభుత్వం పాల్గొనవచ్చని బీజేపీ నేతలు చెబుతుండగా, బొగ్గు గనుల వేలం ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ నినదిస్తుంది. సింగ‌రేణికి బొగ్గు గ‌నులు కేటాయించ‌కుండా ఉద్దేశ‌పూర్వకంగా చేస్తున్న‌ కుట్ర ఇది అంటూ బీఆర్ఎస్ వాయిస్ పెంచేసింది. మొత్తం మీద అంకెలు ఇక్కడ తమకు అనుకూలంగా ఉండటంతోనే బొగ్గు గనుల వేలం జరుగుతుందని, ఏపీలో తమకు వ్యతిరేకంగా ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిపోయిందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో నిజం లేకపోలేదు. అందుకే అంకెలు మన భవిష్యత్ ను శాసిస్తాయన్నది ఈ ఉదాహరణలు చాలదూ.


Tags:    

Similar News