సామాన్యుడిపై మరో భారం.. భారీగా పెరగనున్న ఆటో ఛార్జీలు
గడిచిన ఎనిమిదేళ్లుగా ధరల సవరణ లేకపోవడంతో.. రెట్టింపునకు పైగా చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్..
హైదరాబాద్ : ఒకవైపు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతూ.. సామాన్యుడికి బతుకు భారమయ్యేలా చేస్తున్నాయి. ఉదయం లేచింది మొదలు.. అమ్మో ! ఈ రోజు ఇంట్లోకి ఏం తేవాలో ? ఏం తీసుకొస్తే ఎంత ఖర్చవుతుందో? అనుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. దీనికి తోడు ఇప్పుడు ఆటో ఛార్జీలు కూడా భారీగా పెరగనున్నాయి. గడిచిన ఎనిమిదేళ్లుగా ధరల సవరణ లేకపోవడంతో.. రెట్టింపునకు పైగా చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ రవాణాశాఖకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. ఆ ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. తక్షణమే ఆటో ఛార్జీలు పెరగనున్నాయి.
ఉదాహరణకు ఆటో బేస్ చార్జీ రూ.20గా ఉంటే, దాన్ని రూ.40 చేయనున్నారు. 1.6 కిలోమీటర్ కు బేస్ ఫేర్ అమలవుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి కిలోమీటర్ కు రూ.11 చార్జీ ఉంటే.. దానిని రూ.25కు పెంచనున్నారు. 2014లో ఆటో ఛార్జీలను సవరించారు. అప్పట్నుంచి ఆటో ఛార్జీల పెంపుపై పలు విడతలుగా చర్చలు జరిపిన అనంతరం.. చార్జీల పెంపు ప్రతిపాదనలను రవాణా శాఖ ఆమోదానికి పంపించినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.