శాతవాహన యూనివర్శిటీ లేడీస్ హాస్టల్ వద్ద ఎలుగుబంటి కలకలం
క్యాంపస్ లో ఎలుగు అడుగుజాడలను పరిశీలించిన అటవీ అధికారులు.. క్యాంపస్ లో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తుండవచ్చని భావించారు..
కరీంనగర్ లో ఉన్న శాతవాహన యూనివర్శిటీ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. యూనివర్శిటీ లేడీస్ హాస్టల్ వద్ద ఎలుగు కనిపించడంతో విద్యార్థులు సహా అధికారులు కూడా హడలిపోయారు. యూనివర్శిటీ వెనుకభాగంలో అటవీప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న బావుల వద్దకు నీటి కోసం ఎలుగుబంట్లు వస్తుంటాయి. కానీ.. ఓ ఎలుగుబంటి ఏకంగా క్యాంపస్ లోకి రావడంతో విద్యార్థులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు.
అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు వెంటనే క్యాంపస్ వద్దకు చేరుకున్నారు. ఎలుగును బంధించేందుకు రెండు బోనులు ఏర్పాటు చేసి, దానిని ఆకర్షిచేందుకు అరటిపండ్ల గెలలను ఉంచారు. ఎలుగును బంధించేంత వరకూ బోనుల వద్దకూ ఎవరూ రావద్దని అటవీశాఖ అధికారులు విద్యార్థులను హెచ్చరించారు. క్యాంపస్ లో ఎలుగు అడుగుజాడలను పరిశీలించిన అటవీ అధికారులు.. క్యాంపస్ లో రెండు ఎలుగుబంట్లు సంచరిస్తుండవచ్చని భావించారు. ఓ విద్యార్థిని తాను 3 ఎలుగుబంట్లను చూశానని చెప్పడంతో, అధికారులు తమ చర్యలను ముమ్మరం చేశారు.