బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక వివాదంపై హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక వివాదంపై హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. జనార్దన్ రెడ్డి ఎన్నిక వివాదంపై హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డిపై మర్రి జనార్దన్ రెడ్డి గెలిచారు. 2019లో నాగం జనార్దన్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్ లో కొన్ని వివరాలు దాచి పెట్టారని ఆరోపిస్తూ నాగం జనార్దన రెడ్డి వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. పిటిషన్ లో ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేదన్న హైకోర్టు.. పిటిషన్ ను కొట్టివేసింది.
మర్రి జనార్దన్ రెడ్డి 2012లో తెలుగుదేశం పార్టీ నుండి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచుకుల్ల దామోదర్ రెడ్డిపై 14,435 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డిపై 54,354 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.