చిన్నపిల్లలకు సంబంధించి.. ఆ వీడియోలు చూస్తే జైలుకే

బాలల లైంగిక వేధింపు అంశాలను, వీడియోలను, ఫొటోలను సర్క్యూలేట్‌ చేసేవారిపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ)

Update: 2023-03-20 06:40 GMT

child abuse

ఇంటర్నెట్ లో పోర్న్ కంటెంట్ కు కొదువ లేదు. ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న దారుణాలకు చాలావరకూ ఆ కంటెంటే కారణమనడంలో సందేహం లేదు. మైనర్లు కూడా అత్యాచారాలకు పాల్పడుతుండటానికి ఇవి ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. ఆ కంటెంట్ కు సంబంధించిన పలు వైబ్ సైట్లపై దేశంలో నిషేధం ఉన్నా.. ఏదొరకంగా అవి నెట్టింట్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉక్కుపాదం మోపేలా తెలంగాణ పోలీసులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇంటర్నెట్ లో చిన్న పిల్లల అశ్లీల (చైల్డ్‌పోర్న్‌) వీడియోలు, ఫొటోలు, ఇతర అభ్యంతరకర కంటెంట్‌ పదే పదే చూసినా, షేర్ చేసినా జైలుకి వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు.

బాలల లైంగిక వేధింపు అంశాలను, వీడియోలను, ఫొటోలను సర్క్యూలేట్‌ చేసేవారిపై నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) అందించే సమాచారం ఆధారంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో నెల వ్యవధిలోనే 43 మందిని అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పీడోఫైల్స్‌ (పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ ఉండటం) స్వభావం ఉన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే చిన్నారులపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. చిన్నారుల లైంగిక వేధింపుల వీడియోలను నెట్టింట్లో వెతికి మరీ చూసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందుకు ఎవరూ అతీతం కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు సైతం దీనికి అలవాటు పడుతున్నట్టు గుర్తించారు.
మనదేశంలో సీశామ్‌ ఫైల్స్‌ చట్టవిరుద్ధమని, సెక్షన్‌ 67(బి), ఐటీ చట్టం 2000 ప్రకారం శిక్షార్హులని తెలంగాణ సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు.ఇలాంటి కేసుల్లో అన్ని ఫోన్ల ఐపీ అడ్రస్‌లు జాతీయస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోలీసులకు తెలిసిపోతాయన్నారు. నేరం రుజువైన నేపథ్యంలో ఏడేళ్లు జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.


Tags:    

Similar News