నిలిచిపోయిన సాయన్న అంత్యక్రియలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను ఆయన అనుచరులు నిలిపేశారు. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను ఆయన అనుచరులు నిలిపేశారు. మారేడ్ పల్లి శ్మశానవాటికలో జరగాల్సిన అంత్యక్రియలను సాయన్న అనుచరులే అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మరణించడంతో ఆయన అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం శ్మశానవాటికలో ప్రారంభమవుతాయనుకుంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు.
అధికారిక లాంఛనాలతో...
సాయన్న అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించకపోవడంపై ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్నకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అని కూడా లేకుండా సాయన్నను అగౌరవపర్చారంటూ వారు ఆందోళనకు దిగారు. దీంతో అంత్యక్రియలకు హాజరైన మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరకు డిప్యూటీ ఛైర్మన్ పద్మారావు గౌడ్ సాయన్న అనుచరులతో మాట్లాడారు. అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలను నిర్వహిస్తామని చెప్పడంతో సాయన్న అనుచరులు శాంతించారు.