Breaking : కవితకు బిగ్ రిలీఫ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవిత పిటీషన్ విచారణను నవంబరు 20వ తేదీకి వాయిదా వేసింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవిత పిటీషన్ విచారణను నవంబరు 20వ తేదీకి వాయిదా వేసింది. అయితే తదుపరి విచారణ వరకూ కవితకు ఎలాంటి సమన్లు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. మహిళ అయినంత మాత్రాన విచారణ వద్దనలేమని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే కొంత రక్షణ కల్పించాలని అభిప్రాయపడింది.
కేసు వాయిదా...
అయితే దీనిపై కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారించడం సీఆర్పీసీకి విరుద్దమంటూ ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. నళిని చిదంబరం కేసును ప్రస్తావిస్తూ ఆమెకు ఇచ్చిన వెసులుబాటును తనకు కల్పించాలని, తనను కూడా ఇంట్లో విచారించేలా ఆదేశాలివ్వాలని కవిత కోరారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేంత వరకూ ఎలాంటి సమన్లు జారీ చేయకూడదని తెలిపింది. దీంతో మరో రెండు నెలల పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఈడీ విచారణకు హజరు కావాల్సిన అవసరం లేదు.