Kalvakuntla Kavitha : రేవంత్ గేమ్ ఛేంజర్ కాదు.. నేమ్ ఛేంజర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఆయన గేమ్ ఛేంజర్ కాదని, నేమ్ ఛేంజర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదన్న కవిత ఎన్నికల హామీలను పూర్తిగా పక్కన పెట్టారన్నారు. శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.
విజన్ లేకుండా...
ఒక విజన్ లేకుండా బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విమర్శించారు. పథకాలకు పాత పేర్లను తొలగించి కొత్త పేర్లను పెడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. అరవై రోజుల్లోనే ఈ పాలనపై ప్రజలకు ఒక అవగాహన వచ్చిందన్న కవిత రైతులకు, యువతకు, మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే తాము రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.