బీఆర్ఎస్ కు నేడు చాలా కీలకమైన రోజు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అన్నికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ

Update: 2023-08-21 02:44 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అన్నికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఉండడం విశేషం. 90 మంది అభ్యర్థుల జాబితాను నేడు సీఎం కేసీఆర్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. 90 శాతం సిట్టింగులకు అవకాశం ఇవ్వబోతున్నారని ఇన్ సైడ్ టాక్. ఓ వైపు ప్రభుత్వ పాలనపై విమర్శలు వస్తూ ఉన్నా.. ఇంకా తెలంగాణ ప్రజలు తన వెంటనే, తన పార్టీ వెంటనే ఉన్నారని బీఆర్ఎస్ అధినేత భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా మంది మంచిగా పని చేస్తున్నారని కేసీఆర్ నమ్ముతూ ఉన్నారు. పని తీరు సరిగా లేని వాళ్లకు ఇప్పటికే సీఎం కేసీఆర్ హెచ్చరికలు పంపి పద్ధతి మార్చుకోవాలని కోరిన సంగతి తెలిసిందే..!

రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి నెలకొన్న ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కూడా అధికశాతం అవకాశం సిట్టింగులకే ఇవ్వడమనేది సాహసమనే చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్ గత ఎన్నికలకంటే కాస్త స్ట్రాంగ్ గానే ఉన్నాయి. మునుపటి ఎన్నికలతో పోలితే ఈ రెండు పార్టీల పరిస్థితి బాగానే మెరుగుపడింది. సిట్టింగ్ లకు మరోసారి కూడా సీట్ ఇస్తే.. ఆయా నియోజకవర్గాల్లో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న వాళ్లు పార్టీని మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో దాదాపు అన్ని స్థానాల్లోనూ ఆశావహులు ఉండడం.. గత ఎన్నికలలో టికెట్లు కోల్పోయిన వాళ్లు.. ఈసారి మాత్రం తప్పకుండా తమకు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతూ ఉండడం కూడా బీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. అలాంటివాళ్ళు రెబల్స్ గా మారడమో, వేరే పార్టీలకు వెళ్లడమో వంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే మొదట సీఎం కేసీఆర్ 90 మందితో తొలిజాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
సూర్యాపేటలో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రజలు అవినీతి బీజేపీని గద్దెదించి, కాంగ్రెస్‌కు అధికారమిస్తే, వాళ్లకు పాలన చేతగాక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రైతులకు అలాంటి బాధలు మళ్లీ కావాలా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినయ్‌.. ఇప్పుడొచ్చి అందరూ ఆపద మొక్కుల మొక్కుతరు. ఒక మేరాయన బట్టలు కుడుతున్నట.. సూది కిందవడ్డది.. అప్పుడు లక్ష్మీనర్సింహాస్వామికి దేవుడాదేవుడా నా సూది కింద పడ్డది.. దొరికితే నీకు కిలో శెక్కెర పంచిపెడుత అని మొక్కిండు. భార్య లోపలికెళ్లి వచ్చి.. బాగనే ఉన్నది.. పది పైసల సూదికి పది రూపాయాల శెక్కెర పంచిపెడతారా ఎక్కడన్న అన్నది. ఏ.. సూది దొరకనీ తీయ్‌ ఎగవెడ్తం.. దేవుడేం జేత్తడు? అన్నడట. గట్లనే ఇప్పుడు వచ్చి మీకు ఆరు చందమామలు పెడతం.. ఏడు సూర్యులు పెడతం.. అని అరచేతిలో వైకుంఠం చూపుతరు. మోసపోతే గోస పడుతం. అందుకే అందరినీ దయచేసి కోరేది ఒక్కటే.. మీమీ గ్రామాల్లో విచక్షణతో చర్చ చేసి, బ్రహ్మాండంగా నిర్ణయం తీసుకోండి అని కోరారు సీఎం కేసీఆర్. సూర్యాపేటలో ఇంత పెద్ద సభ జరిగింది అంటే ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినట్టే.. అందులో అనుమానం లేదని అన్నారు సీఎం కేసీఆర్. మరోసారి అద్భుతంగా బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువబోతున్నదని.. అందులో ఎటువంటి డౌట్‌ లేదని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News