BRS : కారు పార్టీ ఖాళీ అవుతుందా? లోకల్ బాడీ ఎన్నికలకు ముందే క్లీన్ చేసేస్తారా?
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డురోజులే ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యేలు వరసగా పార్టీని వీడుతున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డురోజులే ఎదురవుతున్నాయి. ఎంత మంది ఉంటారో తెలియదు. ఎవరు వెళతారో కూడా ఉప్పందడం లేదు. నమ్మకంగా ఉన్న నేతలే పార్టీని వీడి వెళుతున్నారు. ఒక్క ఓటమితో పరిస్థితుల్లో ఇంత మార్పులు చోటు చేసుకుంటాయని గులాబీ పార్టీ నేతలు అస్సలు ఊహించలేదు. పార్టీని నమ్ముకుని ఉంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి మంత్రి పదవిని అయినా దక్కించుకోవచ్చని కొందరయినా ఆగుతారు. కానీ అంతవరకూ వెయిట్ చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఇన్‌స్టంట్ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా రాజకీయ నేతలు జెండాలను మార్చేస్తూ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
కేసీఆర్ నిర్ణయాలే...
ముఖ్యంగా కేసీఆర్ గతంలో చేసిన తప్పులే ఆయనకు ఇప్పుడు శాపంగా మారాయి. తెలుగుదేశం పార్టీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతలు ఎక్కువగా వెళ్లిపోవడం ఆయనను కలవరపరుస్తూ ఉంది. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు టీడీపీ నుంచి వచ్చిన నేతలకు పెద్దపీట వేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నేతలను కాదని, టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. మంత్రి పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీలను కట్టబెట్టారు. అందులో ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఆ తాను ముక్కలేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావడం, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిచయాలు కూడా కలసి రావడంతో నేతలు సులువుగా పార్టీలు మారుస్తున్నారని చెబుతున్నారు.
మల్లారెడ్డి కూడా...
ఇక మరో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. మల్లారెడ్డి కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే వీళ్లంతా కాంగ్రెస్ లో పదవులు వస్తాయని కాదు. తమ నియోజకవర్గంలో పట్టు పోగొట్టుకోకుండా ఉండేందుకు పార్టీ మారుతున్నారని అనుకోవాల్సి ఉంటుంది. ఇక మల్లారెడ్డి లాంటి వాళ్లయితే తమ వ్యాపారాలు, భూములను కాపాడుకోవడానికే జెండాను మార్చేయడానికి సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తుంది. దాదాపు ఇరవై మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి టచ్ లో ఉన్నారంటే ఏ స్థాయిలో నేతలు పార్టీ మారతారన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన వారు మాత్రం ఎవరూ పార్టీ మారే ఆలోచన చేయడం లేదు. కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఆ ఆలోచన చేస్తున్నారు.
ఇరవై మంది...
మరోవైపు కేసీఆర్ కాంగ్రెస్ ను మరింత బలహీనం చేయాలని భావించి బీజేపీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి పరోక్షంగా ఆయన రచించిన వ్యూహం చివరకు ఆయననే దెబ్బతీసే విధంగా ఉంది. దానం నాగేందర్ సయితం పార్టీ మారారు. కేశవరావుకు రెండుసార్లు రాజ్యసభ స్థానం ఇచ్చినా ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారంటే నాయకత్వంలో లోపం ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రయారిటీ మాత్రమే కాదు. కేసీఆర్ చేసిన తప్పులే నేడు ఆయనకు ఇబ్బందిని తెచ్చిపెట్టాయని చెప్పకతప్పదు. అందుకే తాను పదేళ్లు తీసుకున్న నిర్ణయాలు నేడు అవి వికటించి వెక్కిరిస్తున్నాయి. మొత్తం మీద త్వరలోనే బీఆర్ఎస్ లో అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఖాయమని తేలిపోయింది. వీరిని ఆపినా ప్రయోజనం లేదు. నేతలు ఫిక్సవ్వడంతో ఇక ముహూర్తం చూసుకుని మరీ జెండాను మార్చేయడానికి రెడీ అయ్యారు.