కోడిపుంజుకి బస్ టికెట్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిందీ ఘటన. గోదావరి ఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కరీంనగర్ వెళ్తోంది.

Update: 2022-02-08 14:13 GMT

బస్సెక్కితే టికెట్ తీసుకోవాలి. పరిమితికి మించిన లగేజీ ఉంటే దానికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకైతే హాఫ్ టికెట్, పెద్దలకైతే ఫుల్ టికెట్. కానీ.. కోడిపుంజుకు కూడా టికెట్ ఇవ్వడం ఎక్కడైనా చూశారా ? కోడిపుంజు పెద్ద లగేజీలాగా దానికి కూడా టికెట్ కొట్టాడో కండక్టర్. ఇప్పడిదే తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. ఎంతలా అంటే.. విషయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వరకూ వెళ్లింది.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిందీ ఘటన. గోదావరి ఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కరీంనగర్ వెళ్తోంది. మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సు ఎక్కి, కరీంనగర్ వెళ్లేందుకు టికెట్ తీసుకున్నాడు. తనతోపాటు ఓ కోడిపుంజు కూడా ఉంది. కాగా.. బస్సు సుల్తానాబాద్ చేరుకున్న సమయంలో కండక్టర్ అయిన తిరుపతికి కోడి కూత వినిపించింది. అంతే.. వెంటనే కోడికి టికెట్ కొట్టి అలీ చేతికిచ్చాడు. ఆ టికెట్ చూసి షాకవ్వడం ప్యాసింజర్ల వంతైంది. ఇంతకీ కోడిపుంజుకి టికెట్ ఎంతో తెలుసా ? అక్షరాలా రూ.30.
దాంతో ప్రయాణికుడు కోడిపుంజుకి రూ.30 టికెట్ ఆ ? అదేంటి అని అడగ్గా.. ప్రాణంతో ఉండే ప్రతి జీవికి టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పాడు. దాంతో అలీ ఏం మాట్లాడకుండా తనవద్ద ఉన్న చిల్లర ఇచ్చేశాడు. ఓ వ్యక్తి ఆ టికెట్ ను ఫోటో తీసి, జరిగిన విషయంతో ట్వీట్ చేయగా.. అదికాస్తా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకూ వెళ్లింది. విషయంపై స్పందించిన సజ్జనార్.. ఏం జరిగిందో తెలుసుకుని, బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News