Kondareddy Pally: పట్టరాని సంతోషంలో కొండారెడ్డి పల్లె గ్రామస్థులు
మా ఊరి బిడ్డ సీఎం అయ్యిండంటూ కొండారెడ్డి పల్లె ఖుషీ ఖుషీగా సంబురాలు చేసుకుంటోంది. మారుమూల గ్రామం నుంచి..
మా ఊరి బిడ్డ సీఎం అయ్యిండంటూ కొండారెడ్డి పల్లె ఖుషీ ఖుషీగా సంబురాలు చేసుకుంటోంది. మారుమూల గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేత ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందంటూ గ్రామస్తులంతా తెగ సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని అధికారికంగా ప్రకటించటంతో.. కొండారెడ్డి పల్లె గ్రామస్తులు పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకున్నారు. డ్యాన్స్‌లు చేస్తూ గ్రామమంతా హోరెత్తించారు.
రేవంత్ అంటూ ప్రేమతో పిలిచుకునే కొండారెడ్డిపల్లి గ్రామస్థులు.. తమ పటేల్ సీఎం అయ్యాడంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇంటి పెద్ద కొడుకు ప్రయోజకుడైతే ఎంత సంతోషం ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ఆనందం ఉందని తెగ మురిసిపోతున్నారు. రేవంత్ ఎప్పుడు ఊరికి వచ్చినా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడని గుర్తు చేసుకున్నారు గ్రామస్తులు.
అత్త, మామ, బావ, అక్క అంటూ వరుసలు కలుపుతూ అందరితో అప్యాయంగా పలకరించే వాడని గ్రామపెద్దలు చెబుతున్నారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే అన్నట్టు ఆయన ఏ పదవిలో ఉన్న సొంతూరిని.. ఊరి ప్రజలను మాత్రం మర్చిపోరన్నారని గ్రామస్తులు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం ఎల్.బి. స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందరి ఆకాంక్షలు నెరవేరే రోజున జరిగే ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరై కొత్త ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి కోరారు.