అప్పులకుప్పగా తెలంగాణ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను త్యాగం చేసిన 1200 మంది అమరవీరులకు మనం నివాళి అర్పించాలని..;

Update: 2023-06-02 04:17 GMT
telangana formationa day celebrations, formation day celebrations in golconda

formation day celebrations in golconda

  • whatsapp icon

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి నేటితో తొమ్మిదేళ్లు పూర్తై.. పదవ వసంతంలోకి అడుగు పెట్టనుండటంతో రాష్ట్రమంతా దశాబ్ది సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. ఇక ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రప్రభుత్వం గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మనం వేడుకలు జరుపుకొంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను త్యాగం చేసిన 1200 మంది అమరవీరులకు మనం నివాళి అర్పించాలని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. సకలజనులతో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని, ఇది కేవలం ఒకరిద్దరి పోరాటంతో సాధ్యమైంది కాదన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో అలుపెరుగని పోరాటం చేసిన సుష్మా స్వరాజ్ కు కూడా మనమంతా నివాళి అర్పించలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందన్న ఆయన.. కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో కుటుంబ పాలనతో అభివృద్ధి కంటే అవినీతి పెరిగిందన్నారు. అమరవీరుల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శించారు. ఫామ్ హౌస్ లు పెరుగుతున్నాయే తప్ప.. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చింది లేదన్నారు. మతపరమైన రిజర్వేషన్లను ఎందుకు తొలగించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పేదలకు ఇచ్చే దళితబంధులో కూడా ఎమ్మెల్యేలు వాటాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలపై ప్రశ్నించేవారి చేతులకు సంకెళ్లు వేయడం పరిపాటిగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను రాష్ట్రమంలో అమలు చేయకుండా.. కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదనడం సరికాదన్నారు. తెలంగాణలో అవినీతి తగ్గి, పేదలకు న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే కుటుంబపాలనకు బుద్ధి చెబుతారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మోడీ తొమ్మిదేళ్ళ పాలనకు సంభందించి పోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం భారత సాంస్కృతిక వైభవంతో పాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై రెండు చిత్రాల ప్రదర్శన ఉంటుంది.


Tags:    

Similar News