కేసీఆర్ రెండు చోట్ల పోటీ ఎందుకో చెప్పిన కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఆయన ఈసారి కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఆయన ఈసారి కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయడం వెనక కారణం ఏంటి? గజ్వేల్‌లో ఓటమికి భయపడ్డారా? అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. అయితే ఈ ప్రశ్నకు ఇక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. ప్రజల్లో నెలకొన్న బలమైన సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.
బిగ్ షాట్స్ ఎవరూ...
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ గజ్వేల్‌లో ఓటమికి భయపడి రెండు చోట్ల పోటీ చేయడం లేదని తెలిపారు. అలాగంటే ప్రధాని నరేంద్ర మోదీ రెండు చోట్ల ఎందుకు పోటీ చేశారంటూ ఎదురు ప్రశ్నించారు. రెండు స్థానాల్లో గెలిచిన తర్వాత ఏ నియోజకవర్గాన్ని ఉంచుకుంటారన్న ప్రశ్నకు కూడా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల ఫలితాల తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పడం విశేషం. మరో ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎవరూ రాజకీయాల్లో బిగ్ షాట్‌లు ఉండరని, ఎవరికైనా ఓటమి తప్పదని, నాడు ఎన్టీఆర్ ఓడిపోయారని, మొన్న రాహుల్ గాంధీ కూడా ఓడిపోయారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలే అంతిమ నిర్ణేతలని, వారి అభిప్రాయం మేరకే గెలుపోటములుంటాయి తప్పించి, సర్వేలన్నీ హంబక్ అని ఆయన కొట్టిపారేశారు.