దేశమంతా దళితబంధు : కేసీఆర్

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు

Update: 2023-04-14 13:06 GMT

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ట్యాంక్‌బండ్ వద్ద 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అందచేస్తామని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బయి ఏళ్లు గడుస్తున్నా దళితులు మాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. ఎవరో అడిగితే హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదన్న కేసీఆర్ విశ్వమానవుడి విశ్వరూపాన్ని ప్రతిష్టించుకుందామన్న ఆకాంక్షతోనే ఇక్కడ నిర్మించుకున్నామని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న సెక్రటేరియట్‌కు కూడా అంబేద్కర్ పేరును పెట్టుకున్నామని తెలిపిన కేసీఆర్ ఇది విగ్రహం కాదని, విప్లవమని అన్నారు. అంబేద్కర్ అవార్డు కోసం 51 కోట్ల నిధులు కేటాయిస్తామని, తద్వారా వచ్చే వడ్డీతో ఏటా అవార్డులను ప్రదానం చేస్తామని కేసీఆర్ తెలిపారు. మూడు కోట్ల రూపాయల వరకూ వడ్డీ వస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అవార్డును ప్రకటిస్తామని చెప్పారు.

కేసీఆర్‌ను ఆదర్శంగా...
దేశంలోని ముఖ్యమంత్రులంతా కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రంగా అవతరించిందన్న ప్రకాష్ అంబేద్కర్ , చిన్న రాష్ట్రం అయినా.. దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఎదిగిందన్నారు. దళితుల్ని పేదరికం నుంచి బయటపడేసే దళితబంధు ఓ గొప్ప పథకం అని ఆయన అభివర్ణించారు. దళితుల అభ్యున్నతికి దళితబంధు వంటి పథకాలను అమలు చేయాలని, దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ ను ప్రకటించాలని అంబేద్కర్ ఆనాడే చెప్పారని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు.


Tags:    

Similar News