Pocharam : అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నా : పోచారం
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తమ ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు అంగీకరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తమ ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు అంగీకరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోచారం ఇంట్లో భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించామన్నారు. ఈరోజు మంత్రి వర్గ సమావేశంలో రైతు రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నామని, అందుకే రైతు పక్షపాతిగా ఆయన తమకు సహకరించాలని కోరగా అందుకు అంగీకరించారని రేవంత్ రెడ్డి తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డికి తగిన గౌరవం ఇస్తామని ఆయన తెలిపారు.
రైతులకు అండగా...
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన పట్ల ఆకర్షితుడనై తాను పార్టీలో చేరుతున్నానని తెలిపారు. ఆయన చేపట్టే కార్యక్రమాలకు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం వెంట నడవడం తన ప్రధాన కర్తవ్యమని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన రాజకీయ ప్రవేశం జరిగింది కాంగ్రెస్ పార్టీలోనేనని, తర్వాత తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగానని, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరానని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేసే మంచిపనులకు అండగా నిలవాలన్న ఉద్దేశ్యంతోనే ఈనిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు.