Revanth Reddy : నా దగ్గర హైదరాబాద్ ఉంది.. మాకు ప్రపంచంతోనే పోటీ
తమకు పొరుగు రాష్ట్రాలతో పోటీయే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ పోటీ అంతా ప్రపంచంతోనే అని అన్నారు.
తమకు పొరుగు రాష్ట్రాలతో పోటీయే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ పోటీ అంతా ప్రపంచంతోనే అని అన్నారు. కోకాపేటలో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ వద్ద హైదరాబాద్ నగరం ఉందన్నారు. ఇక్కడ ఉన్న అనుకూలతలు దేశంలో ఏ నగరానికి లేవన్నారు. మంచి వాతావరణం, కనెక్టివిటీ వంటివి హైదరాబాద్ కు వరం లాంటిదన్నారు. పొరుగు రాష్ట్రాలకు అంతర్జాతీయ విమానాశ్రయం లేదని, అవుటర్ రింగ్ రోడ్డు లేదని అని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధికి ఎందరో కృషి చేశారన్నారు.పెట్టుబడులు పెట్టిన సంస్థలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అన్ని రకాల అనుమతులను ఇస్తామని తెలిపారు.
పెట్టుబడులు రావడంతో...
నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి హైటెక్ సిటీకి నాడు శంకుస్థాపన చేశారన్న ఆయన రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలు మరింత హైదరాబాద్ నగరం అభివృద్ధికి దోహదపడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల కృషి కూడా హైదరాబాద్ నగర అభివృద్ధిపై ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో మొత్తం మూడు నగరాలున్నాయని, నాలుగో నగరం వస్తుందని ఆయన అన్నారు. తన పదిహేను రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి 31,500 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలిపారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు ద్వారా సెమీ అర్బన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ తో పోటీ పడే నగరం మరేదీ లేదని ఆయన తెలిపారు.