Komatireddy : ఏమయ్యా కోమటిరెడ్డీ నీ కెపాసిటీ ఏంది జర చెప్పవూ?
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనను మించిన నేత లేరన్న భావనలో ఉన్నట్లుంది.;

కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనను మించిన నేత లేరన్న భావనలో ఉన్నట్లుంది. మంత్రి వర్గ విస్తరణపై కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పడు కాంగ్రెస్ లో కాక రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నానని అనడం వరకూ ఓకే కానీ, సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని కోరడంలో ఆంతర్యమేంటని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. భువనగిరి పార్లమెంటు నియోజవర్గంలో జరిగిన ఎన్నికలు జరిగితే తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానని తలిపారు. అదే సమయంలో ప్రజల పక్షాన తాను నిలబడతానని అన్న కోమటిరెడ్డి తనకు హోంశాఖ అంటే ఇష్టమంటూ మనసులో మాటను బయటపెట్టారు.
అయితే ఎందుకు ఓడిపోయారు?
అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ నాయకత్వంపై అలిగి బీజేపీలోకి వెళ్లిన కోమటిరెడ్డి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి ఎందుకు ఓటమి పాలయ్యారంటూ ప్రశ్నిస్తున్నారు. అంత కెపాసిటీ ఉంటే నాడు ఉప ఎన్నికల్లోనూ గెలిచేవారివిగా అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. తనకు తాను తోపు అని ఊహించుకుంటే సరిపోదని, ప్రజలు ఆదరిస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే అవుతారని తెలిపారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై అలిగి బీజేపీ లోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత ఎందుకు మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారని నిలదీస్తున్నారు. డబ్బు ఉంటేనే సరిపోతుందా? అని ఫైర్ అవుతున్నారు.
పార్టీని నమ్ముకున్న వాళ్లను కాదని...
మీ సోదరుడు లాగా పార్టీని నమ్ముకుని ఉండకుండా ఎందుకు పార్టీని మార్చాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. కోమటిరెడ్డి కుటుంబానికి రెండు మంత్రిపదవులు ఇవ్వడమేంటని కూడా కాంగ్రెస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పార్టీలు తమ ప్రయోజనాల కోసం మారేవారికి మంత్రి పదవులు ఇవ్వకూడదని కొందరు ఇప్పటికే పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు పంపినట్లు తెలిసింది. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని, దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోస్తూ ఆ పార్టీ నీడలోనే కష్టాలు పాలయిన నేతలకు మాత్రమే మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని, అంతే తప్ప ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారంటూ మంత్రి పదవులు అప్పజెపితే ఫిరాయింపులకు అధినాయకత్వమే ప్రోత్సహించినట్లవుతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. గడ్డం వివేక్ కు కూడా ఇదే విధానం వర్తిస్తుందని, కాంగ్రెస్ ను నమ్ముకున్న వారికే మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ ఊపందుకుంది. మంత్రి వర్గ విస్తరణ వేళ ఇది పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.