Heat Waves : మార్చి నెలలోనే మే నెల వాతావరణం... వర్షాల తర్వాత తీవ్రమైన ఉష్ణోగ్రతలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువయింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి.;

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువయింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెలలోనే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఇక ఎండలు ఇంకెంత దంచి కొడతాయోనన్న భయం అందరిలోనూ నెలకొంది. ఈ నెల మూడో వారంలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చనేసింది. వీలయినంత వరకూ బయటకు రాకుండా ఇంటిపట్టునే గడపాలని సూచిస్తున్నారు. కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు.
పర్యాటక రంగం కూడా...
ఉదయం ఎనిమిది గంటలు దాటితే చాలు భానుడు చెలరేగిపోతున్నాడు. బయటకు వస్తే చురుక్కుమంటుంది. ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత ఏ స్థాయిలో మార్చినెలలో ఉందంటే మేనెలను తలపిస్తుంది.కొన్ని చోట్ల 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రతకు కొబ్బరిబోండాలు, చల్లటి మజ్జిగ తాగుతూ కొంతవేడిని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పర్యాటక రంగంపై కూడా ఎండల తీవ్రత ప్రభావం పడిందంటున్నారు. ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే వారు కొంత తగ్గిందని తెలిపారు.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో మధ్యాహ్నంవేళ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. నిన్న వర్షం పడటంతో ఎండలు మరింత ముదిరాయి. ఉదయాన్నే తమ విధులకు ఉద్యోగులు బయలుదేరి వెళుతున్నారు. అయితే హైదరాబాద్ లో ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా కొంత తగ్గిందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే జనాభా కొంత తగ్గిందని చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనూ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల దెబ్బకు వ్యాపారాలు కూడా అంత సజావుగా జరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద మరో మూడు నెలల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.